AIM-424 Malice: 463 కి.మీ. దూరం నుంచే టార్గెట్ ధ్వంసం.. అమెరికా 'మాలిస్' క్షిపణి ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
ఆధునిక యుద్ధ విధానాల్లో సాంకేతికతకు అమెరికా మరింత ప్రాధాన్యం ఇస్తోంది. శత్రు లక్ష్యాలను సుదూరం నుంచే ఎదుర్కొనే సామర్థ్యంతో అమెరికా నౌకాదళం తాజాగా కొత్త ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'మాలిస్ (Malice)'గా పిలుస్తున్న ఈ ఆయుధం వందల కిలోమీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలను ఛేదించగలదని అమెరికా చెబుతోంది. అసలు ఈ మాలిస్ క్షిపణి ఏమిటి? దీని సామర్థ్యాలేంటి? ఏ యుద్ధ విమానాల్లో దీన్ని ఉపయోగించనున్నారు?
వివరాలు
మాలిస్.. 463 కి.మీ. రేంజ్..
మాలిస్ క్షిపణికి సాంకేతికంగా AIM-424 LRAAM అనే పేరు ఉంది. అమెరికా నౌకాదళం.. రేథియాన్ సంస్థతో కలిసి ఈ అధునాతన ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని అభివృద్ధి చేసింది.
దీని పొడవు 4.11 మీటర్లు కాగా.. బరువు సుమారు 680 కిలోలు. ఇందులో సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగించారు.
మాలిస్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను అమెరికా నేవీ వెల్లడించలేదు.
అయితే శత్రు లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత దానిని అత్యంత దూరం నుంచే ఛేదించే విధంగా ఈ క్షిపణిని రూపొందించినట్లు తెలుస్తోంది.
సుమారు 250 నాటికల్ మైళ్లు అంటే 463 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది చేరుకోగలదని అమెరికా చెబుతోంది.
వివరాలు
ఏ యుద్ధ విమానాల్లో వినియోగం?
గగనతల లక్ష్యాలను ఛేదించేందుకు రూపొందించిన క్షిపణుల్లో ఇదే అత్యంత సుదూర రేంజ్ కలిగిన ఆయుధంగా అమెరికా పేర్కొంటోంది.
దీని వల్ల యుద్ధ విమానాలు శత్రు లక్ష్యాలకు చాలా దగ్గరగా వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఫలితంగా ప్రత్యర్థి దాడుల పరిధిలోకి వెళ్లే ప్రమాదం తగ్గి.. యుద్ధ సమయంలో అమెరికా వైపు జరిగే నష్టాన్ని పరిమితం చేసే అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
AIM-424 మాలిస్ క్షిపణిని ప్రధానంగా ఎఫ్-35సీ యుద్ధ విమానాల కోసం రూపొందించారు.
వీటితో పాటు F/A-18E/F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్లలోనూ ఈ క్షిపణులను వినియోగించే అంశంపై పరీక్షలు కొనసాగుతున్నాయి.
వివరాలు
ఇవే ప్రధాన లక్ష్యాలు..
ఇటీవల నిర్వహించిన ఓ టెస్ట్ ఈవెంట్‌కు సంబంధించిన చిత్రాలను అమెరికా నేవీ విడుదల చేసింది. అందులో యుద్ధ విమానాలకు ఈ క్షిపణులను అమర్చిన దృశ్యాలు కనిపించాయి.
మాలిస్ క్షిపణి ప్రధానంగా శత్రుదేశాలకు చెందిన కీలక గగనతల వనరులను లక్ష్యంగా చేసుకునేలా రూపొందించారు.
శత్రు యుద్ధ విమానాలు, దీర్ఘశ్రేణి బాంబర్లు, గగనతల నియంత్రణ విమానాలు ఇందులో ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి.
అంతేకాకుండా ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య కార్యకలాపాలకు ఉపయోగించే విమానాలు, గాల్లోనే ఇంధనం నింపే ఏరియల్ రీఫ్యుయలింగ్ ట్యాంకర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విమానాలను కూడా మాలిస్ టార్గెట్ చేయగలదని అమెరికా వెల్లడించింది.
అయితే ఈ క్షిపణిని నేవీ ఆవిష్కరించినప్పటికీ.. వాస్తవంగా ఎప్పుడు, ఎక్కడ వినియోగించనున్నారనే విషయాన్ని మాత్రం అమెరికా ఇప్పటివరకు వెల్లడించలేదు.
వివరాలు
'వేల మైళ్ల'పై చైనా గురి..
అమెరికా మాలిస్ క్షిపణిని ప్రకటించిన నేపథ్యంలో.. చైనా కూడా సుదూర లక్ష్యాలను ఛేదించగల ఆయుధాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
వేల మైళ్ల దూరంలోని గగనతల లక్ష్యాలను ఛేదించగల హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్స్‌ను చైనా అభివృద్ధి చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ ఆయుధాలు దాదాపు 2,414 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవని అంచనా.
అంటే చైనా భూభాగం నుంచే చాలా దూరంలోని గగనతల లక్ష్యాలను చేరుకునే సామర్థ్యం వాటికి ఉండే అవకాశం ఉంది.
వివరాలు
'వేల మైళ్ల'పై చైనా గురి..
అయితే ఈ ఆయుధాలకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటి వాస్తవ సామర్థ్యాలపై స్పష్టత ఇంకా బయటకు రాలేదు.
ఇదిలా ఉండగా.. చైనా వద్ద ప్రస్తుతం కనీసం 3,150 బాలిస్టిక్ క్షిపణులు, సుమారు 300 గ్రౌండ్-లాంచ్డ్ క్రూజ్ మిసైళ్లు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.
దీంతో అమెరికా, చైనా మధ్య సుదూర క్షిపణి సామర్థ్యాల పోటీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.