Alaska Airlines: 16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం డోర్.. సర్వీసులను నిలిపివేసిన అలాస్కా ఎయిర్‌లైన్స్
అలస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 విమానం దాదాపు 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో డోర్ ఊడిపోయింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో బోయింగ్ 737-9 మొత్తం విమానాలను అలాస్కా ఎయిర్‌లైన్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. గాల్లో ఉండగా విమానం డోర్ ఊడిన ఘటనపై అలాస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆందోళనను వ్యక్తం చేశారు. 1282 విమానంలో రాత్రి జరిగిన సంఘటనను అనుసరించి 65 బోయింగ్ 737-9 విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు మినికుచి చెప్పారు. పూర్తిస్థాయి మెయింటెనెన్స్, సేఫ్టీ తనిఖీల తర్వాత తిరిగి సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు.
171 మంది ప్రయాణికులు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని..
అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ విమానాశ్రయం నుంచి 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో విమానం ఒంటారియోకు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం డోర్ ఊడిపోయింది. దీంతో విమానంలో ఉన్నవారంతా.. భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నారు. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో అందులో ఉన్న ప్రయాణీకులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని అలస్కా ఎయిర్ లైన్స్ వెల్లడించింది.