LOADING...
Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు 5 లక్షల రష్యా సైనికులు మృతి: బ్రిటన్ గూఢచారి సంస్థ
ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు 5 లక్షల రష్యా సైనికులు మృతి

Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంలో దాదాపు 5 లక్షల రష్యా సైనికులు మృతి: బ్రిటన్ గూఢచారి సంస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద గూఢచారి సంస్థ జీసీహెచ్‌క్యూ (GCHQ) వెల్లడించింది. ఈ విషయాలను ఆ సంస్థ డైరెక్టర్ ఆన్ కీస్ట్-బట్లర్ తన తొలి బహిరంగ ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుతం బ్రిటన్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లు, ముఖ్యంగా రష్యా నుంచి వస్తున్న ముప్పులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా బ్రిటన్‌లోని కీలక మౌలిక వసతులు,ప్రజాస్వామ్య వ్యవస్థలు,సరఫరా వ్యవస్థలు, ప్రజల నమ్మకాన్ని నిరంతరం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆన్ కీస్ట్-బట్లర్ ఆరోపించారు. బ్రిటన్ ప్రస్తుతం అత్యంత కీలక పరిస్థితిని ఎదుర్కొంటోందని ఆమె హెచ్చరించారు. బ్రిటన్ భూభాగంలో గూఢచర్య చర్యలు, విధ్వంసక చర్యలు కూడా పెరిగాయని తెలిపారు.

వివరాలు 

ఉక్రెయిన్, రష్యా నష్టాలపై గణాంకాలు

ఉక్రెయిన్, రష్యా రెండూ ప్రత్యర్థి దేశ నష్టాలపై గణాంకాలు విడుదల చేస్తున్నప్పటికీ, తమ సైనికుల మరణాల సంఖ్యను పూర్తి స్థాయిలో వెల్లడించడంలో వెనుకంజ వేస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ 2022 నుంచి తమ దేశానికి చెందిన 55 వేల మంది సైనికులు మరణించారని చెప్పారు. ఇదిలా ఉండగా బీబీసీ రష్యన్, మీడియాజోనా సంస్థలు, వాలంటీర్ల బృందం కలిసి రష్యా యుద్ధ నష్టాలను పరిశీలిస్తున్నాయి. అధికారిక నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు, సమాధులు, స్మారక చిహ్నాల ఆధారంగా ఇప్పటివరకు 2,23,539 మంది రష్యా సైనికుల మరణాలను ధృవీకరించినట్లు తెలిపాయి. అయితే అసలు మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సైనిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

రష్యా, చైనా అంతరిక్ష రంగంలో భారీ పెట్టుబడులు

రష్యా, చైనా దేశాలు అంతరిక్ష రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని జీసీహెచ్‌క్యూ చీఫ్ తెలిపారు. శాంతియుత అవసరాలతో పాటు సైనిక ప్రయోజనాల కోసం కూడా ఈ దేశాలు సాంకేతిక సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని చెప్పారు. ముఖ్యంగా చైనా ఇప్పుడు సైన్స్, టెక్నాలజీ రంగంలో సూపర్ పవర్‌గా ఎదిగిందని పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

సైబర్ దాడులపై అప్రమత్తం

ప్రపంచవ్యాప్తంగా AI టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బ్రిటన్, దాని మిత్రదేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె హెచ్చరించారు. సైబర్ భద్రత ప్రతి సంస్థకు అత్యంత కీలకమైందని చెప్పారు. ఫిషింగ్ దాడులు, ర్యాన్స్‌మ్‌వేర్ వంటి సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆరోపణలు లండన్‌లో మాజీ కేజీబీ అధికారి అలెగ్జాండర్ లిట్‌వినెంకో హత్య, 2018లో సెర్గీ స్క్రిపాల్‌పై జరిగిన విషప్రయోగ ఘటనలకు కూడా రష్యానే కారణమని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను క్రెమ్లిన్ ఖండిస్తోంది.

Advertisement

వివరాలు 

జీసీహెచ్‌క్యూ గురించి..

జీసీహెచ్‌క్యూ అంటే గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్‌క్వార్టర్స్. ఇది బ్రిటన్‌లోని మూడు ప్రధాన గూఢచారి సంస్థల్లో అతిపెద్దది. సైబర్ భద్రత, సిగ్నల్స్ ఇంటెలిజెన్స్‌పై ఈ సంస్థ ప్రధానంగా పనిచేస్తుంది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.

Advertisement