Page Loader
మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌
18వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్

మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌

వ్రాసిన వారు Stalin
Jan 05, 2023
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఆండీ జాస్సీ ప్రకటించారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ వ్యాపారం పుంజుకున్న నేపథ్యంలో.. డిమాండ్‌కు అనుగుణంగా అమెజాన్ భారీగా ఉద్యోగులను నియమించుకుంది. అయితే ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. 10వేల మంది ఉద్యోగుల తొలగింపుపై నవంబర్‌లోనే అమెజాన్ ప్రకటన చేసింది. కానీ కొంతమందిని తొలగించలేదు. వారిని తాజా జాబితాలో చేర్చి మొత్తం 18వేల మందిని తొలగిస్తున్నట్లు సీఈఓ ప్రకటించారు.

అమెజాన్

'యూరప్‌లో కూడా ఉద్వాసన తప్పదు'

ఉద్యోగుల తొలగింపు విషయం కష్టమని తెలిసినా.. తప్పడం లేదని, లోతుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ ఆండీ జాస్సీ పేర్కొన్నారు. లే ఆఫ్ బారిన పడిన వారికి తమ మద్దతు ఉంటుందని, ఆరోగ్య బీమా ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు. వారి ఉద్యోగ వేటలో కూడా తాము సహకరిస్తామని వెల్లడించారు. అయితే యూరప్‌లో కూడా ఉద్యోగుల ఉద్వాసన తప్పదని సీఈఓ వివరించారు. జనవరి 18 నుంచి లే ఆఫ్స్ ఉంటాయని చెప్పారు. అయితే ఈ విషయాన్ని తొలుత ఉద్యోగులకు చెప్పిన తర్వాత.. అధికారిక ప్రకటన చేయాలనుకున్నట్లు సీఈఓ ఆండీ జాస్సీ పేర్కొన్నారు. తమ కంపెనీలోని ఒకరు.. ఉద్యోగుల తొలగింపు గురించి బయటికి లీక్ చేయడంతో.. తాము ముందే స్పందించాల్సి వస్తోందని వివరించారు.