USA: అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులకు కొత్త వీసా నిబంధనల ప్రభావం.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అనుమతి తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు సంబంధించి హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) కొత్త వీసా నిబంధనలను గురువారం విడుదల చేసింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం, విద్యార్థులు అమెరికాలో గరిష్ఠంగా నాలుగేళ్లపాటు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత అక్కడే చదువు కొనసాగించాలన్నా లేదా ఉండాలన్నా సంబంధిత అధికారుల నుంచి తాజా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.
వివరాలు
కాంగ్రెస్ ఆమోదం లభించిన తర్వాత.. కొత్త నిబంధనలు అమల్లోకి
ఇకపై జే-1 (J-1) వీసాలపై అమెరికాకు వచ్చే ఎక్స్ఛేంజ్ విజిటర్లతో పాటు, ఐ (I) వీసాలపై వెళ్లే విదేశీ మీడియా ప్రతినిధులకు కూడా నిర్దిష్ట నివాస కాలపరిమితిని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన అమెరికా కాంగ్రెస్ పరిశీలనలో ఉంది. కాంగ్రెస్ ఆమోదం లభించిన తర్వాతే ఈ కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
ఇప్పటివరకు ఎఫ్-1 (F-1) విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లిన వారు తమ విద్యా కోర్సు పూర్తయ్యే వరకు 'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్ (Duration of Status)' నిబంధన కింద అక్కడే ఉండే వెసులుబాటు ఉండేది.
అయితే కొత్త విధానంలో ఈ సౌకర్యాన్ని తొలగించి, దాని స్థానంలో నిర్దిష్ట కాలపరిమితిని అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
వివరాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందితే గ్రీన్‌కార్డు కష్టమే
మరోవైపు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందే వలసదారులకు గ్రీన్‌కార్డులు మంజూరు చేయకుండా ఉండే నిబంధనను ట్రంప్ ప్రభుత్వం మరోసారి అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు 'పబ్లిక్ ఛార్జ్ (Public Charge)' విధానాన్ని తిరిగి తీసుకొస్తూ గురువారం ప్రకటించింది.
ఈ నిబంధన అమల్లోకి వస్తే ఆహార స్టాంపులు (Food Stamps), మెడికెయిడ్ (Medicaid), హౌసింగ్ వోచర్లు (Housing Vouchers) వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు భవిష్యత్తులో గ్రీన్‌కార్డు పొందే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.