Defense of Greenland: గ్రీన్‌లాండ్‌పై అమెరికా పట్టు.. ఇక అక్కడ అగ్రరాజ్యానిదే పెత్తనం!
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా కుదిరిన రక్షణ ఒప్పందంతో గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికాకు శాశ్వత నియంత్రణ లభించినట్లయింది. ప్రస్తుతం గ్రీన్‌లాండ్ డెన్మార్క్ సార్వభౌమాధికారం కింద ఉంది. రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచే గ్రీన్‌లాండ్‌తో అమెరికాకు సైనిక సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే.. అక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయాలన్నా, సైనిక కార్యకలాపాలను విస్తరించాలన్నా స్థానిక ప్రభుత్వాలు లేదా డెన్మార్క్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా అమెరికా, గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌ల మధ్య కుదిరిన ఒప్పందంతో.. ఎవరి అనుమతులు లేకుండానే గ్రీన్‌లాండ్‌లో సైనిక కార్యకలాపాలను ఏకపక్షంగా విస్తరించేందుకు అమెరికాకు అధికారం దక్కినట్లయింది.
వివరాలు
మౌలిక వసతులు నిర్మించకుండా నిరోధించవచ్చు
వాస్తవానికి ఈ తాజా ఒప్పందం వెనుక ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యాతోపాటు చైనా ప్రాబల్యం విస్తరించకుండా అడ్డుకోవాలన్న వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతం నుంచి ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతం వరకు చైనా ఎదుగుదలను అడ్డుకునేందుకు ఈ ఏడాది అమెరికా చేపట్టిన రెండో కీలక అడుగుగా దీనిని చూడొచ్చు.
2026 ఏప్రిల్‌లో ఇండొనేసియాతో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ద్వారా మలక్కా జలసంధిపై అమెరికా తన పట్టు మరింత బిగించగలిగే పరిస్థితి ఏర్పడింది.
తాజాగా గ్రీన్‌లాండ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఆ ద్వీపంలో రష్యా, చైనా లేదా మరే నాటోయేతర దేశం సైనిక స్థావరాలు ఏర్పాటు చేయకుండా, అరుదైన ఖనిజాల కోసం తవ్వకాలు చేపట్టకుండా, మౌలిక వసతులు నిర్మించకుండా నిరోధించవచ్చు.
వివరాలు
రష్యాను అడ్డుకోవడానికి..
వాతావరణ మార్పుల ప్రభావంతో ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలోని గ్రీన్‌లాండ్‌లో మంచు వేగంగా కరిగిపోతోంది.
దీంతో ఈ ప్రాంతం వాణిజ్య నౌకల రాకపోకలకు క్రమంగా అనుకూలంగా మారుతోంది. ఈ పరిణామాన్ని ఉపయోగించుకుంటున్న రష్యా.. ఉత్తర ధ్రువ మార్గం ద్వారా చమురు, గ్యాస్, వాణిజ్య సరకులను ఎగుమతి చేస్తోంది. ఇదే మార్గాన్ని చైనా 'ధ్రువప్రాంత సిల్క్ రోడ్'గా పిలుస్తోంది.
ఈ మార్గం ద్వారా ఐరోపాకు కంటైనర్ సర్వీసును ప్రారంభించనున్నట్లు బీజింగ్ ఇటీవల ప్రకటించింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాల కారణంగా సూయెజ్ కాలువ, హర్మూజ్ జలసంధుల మీదుగా చైనా చమురు, గ్యాస్ దిగుమతులు అనిశ్చితిలో పడ్డాయి.
ఒకవేళ మలక్కా జలసంధి కూడా మూసుకుపోతే.. ఇంధన దిగుమతులతోపాటు చైనా సరకుల ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం పడుతుంది.
వివరాలు
అణు జలాంతర్గాముల కోసం స్థావరం
అందుకే చైనా ధ్రువప్రాంత సిల్క్‌రోడ్‌ను ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
రష్యా చమురు, గ్యాస్ అయినా.. చైనా సరకులు అయినా.. ఉత్తర సముద్రమార్గం లేదా ధ్రువ ప్రాంత సిల్క్ రోడ్ మీదుగా అట్లాంటిక్ మహాసముద్రానికి చేరుకోవాలి.
అక్కడి నుంచి ఐరోపా, ఆఫ్రికా, అమెరికా ఖండాలకు వెళ్లే మార్గంలో గ్రీన్‌లాండ్ కీలక భౌగోళిక స్థానంగా ఉంది.
ఈ నేపథ్యంలో అక్కడ అమెరికా ఏర్పాటు చేసే సైనిక, నౌకా స్థావరాలు రష్యా, చైనా యుద్ధ నౌకలతోపాటు వాణిజ్య నౌకల రాకపోకలను సులభంగా అడ్డుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఇప్పటికే రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలోని కోలా ద్వీపకల్పంలో తన ఉత్తర నౌకాదళ యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాముల కోసం స్థావరాన్ని ఏర్పాటు చేసింది.
వివరాలు
కృత్రిమ ద్వీపాలు నిర్మాణం
ఈ నేపథ్యంలో గ్రీన్‌లాండ్‌లో అమెరికా ఏర్పాటు చేసే స్థావరాలు రష్యా నౌకల కదలికలను ముందుగానే పసిగట్టి హెచ్చరించేందుకు ఉపయోగపడతాయి.
అంతేకాకుండా రష్యన్ జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు కూడా ఇవి అమెరికాకు తోడ్పడతాయి.
గ్రీన్‌లాండ్‌లో పౌర, సైనిక ప్రయోజనాలకు ఉపయోగపడే మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతులు పొందేందుకు చైనా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. తాజా ఒప్పందం చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలకు గండికొట్టే అవకాశం ఉంది.
చైనా ఎగుమతులు ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రం మీదుగా మలక్కా జలసంధికి, అక్కడి నుంచి హర్మూజ్ జలసంధి, సూయెజ్ కాలువల మీదుగా ఐరోపాకు చేరుతున్నాయి.
దక్షిణ చైనా సముద్రంలో తన ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం కలగకుండా చూసుకోవడానికి చైనా అక్కడ కృత్రిమ ద్వీపాలను నిర్మించింది.
వివరాలు
చైనాను కట్టడి చేయడానికి..
వాటిపై సైనిక, నౌకా స్థావరాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ చర్యలు మలేసియా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దక్షిణ చైనా సముద్ర తీర దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
వీటిలో ఫిలిప్పీన్స్‌తో అమెరికాకు ఇప్పటికే వ్యూహాత్మక పొత్తు ఉంది. చైనాను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో అమెరికా ఇండొనేసియాతో సైనిక, వాణిజ్య ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది.
ఫిబ్రవరిలో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఒక కఠినమైన నిబంధనను చేర్చింది. దీని ప్రకారం.. చైనా వస్తువులు ఇండొనేసియా మీదుగా రూట్ మార్చుకుని అమెరికా మార్కెట్‌లోకి చేరకుండా ఇండొనేసియా కఠినమైన నిఘా పెట్టాలి.
అమెరికా.. ఇండొనేసియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కేవలం 19 శాతం సుంకాలను విధిస్తోంది.
వివరాలు
అమెరికాకు ఎగుమతి చేయకుండా నిరోధించడమే ఆ షరతు ఉద్దేశం
ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకుని చైనా తన సరకులను ఇండొనేసియా ద్వారా అమెరికాకు ఎగుమతి చేయకుండా నిరోధించడమే ఈ షరతు ఉద్దేశం.
అదే సమయంలో ఇండొనేసియాలో చైనాకు చెందిన నికెల్ నిక్షేపాల తవ్వకం, ప్రాసెసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి కూడా చెక్ పెట్టేందుకు ఈ వాణిజ్య ఒప్పందం ఉపయోగపడుతుంది.
ఒప్పందంలోని మరికొన్ని క్లాజుల కారణంగా ఇండొనేసియాలో చైనా ఐటీ కంపెనీల విస్తరణకు కూడా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇక ఏప్రిల్‌లో కుదిరిన అమెరికా-ఇండొనేసియా రక్షణ ఒప్పందం కింద రెండు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంతోపాటు పహరాను పెంచనున్నాయి.
ఇలా ఒక్కో ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేసేలా అమెరికా తన వ్యూహాలను విస్తరిస్తోంది.
వివరాలు
ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతం వరకు విస్తరించింది
ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను అందించడం, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో 'క్వాడ్' కూటమిని ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా గ్రీన్‌లాండ్ విషయంలో కుదిరిన ఒప్పందం ద్వారా ఆ వ్యూహాన్ని ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతం వరకు విస్తరించినట్లయింది.