America budget: రెండు వారాల యుద్ధ ఖర్చు.. నాసా ఏడాది బడ్జెట్‌కు సమానం! అమెరికా ఖర్చుల షాకింగ్ నిజం
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా చేస్తున్న ఖర్చులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుత ఖర్చు ఇలానే కొనసాగితే, రెండు వారాల్లోనే అమెరికా ఖర్చు భారీగా పెరగనుంది. ఏడాది పాటు అంతరిక్ష పరిశోధన కోసం కేటాయించే బడ్జెట్‌కు సమానంగా ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఈ యుద్ధానికి 200 బిలియన్ డాలర్లకు పైగా నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఆ ప్రతిపాదన ఆమోదం పొందకముందే, ప్రారంభ ఖర్చులే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. యుద్ధం మొదటి వారంలోనే అమెరికా సుమారు 11.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇందులో కేవలం ఆయుధాల ఖర్చే ఉంది. సైనికుల పంపిణీ, రవాణా, నిర్వహణ వంటి ఇతర ఖర్చులు ఇందులో లెక్కలో లేవు.
వివరాలు
ఆరోగ్య రంగంపైనా ఇదే పరిస్థితి..
ఇక అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వార్షిక బడ్జెట్ సుమారు 24.4 బిలియన్ డాలర్లు. చంద్రుడిపై మానవులను మళ్లీ పంపించడం, భవిష్యత్తులో మార్స్‌కు మిషన్లు చేపట్టడం వంటి లక్ష్యాలకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రస్తుత యుద్ధ ఖర్చుల వేగం చూస్తే, నాసా ఏడాది బడ్జెట్ మొత్తాన్ని రెండు వారాల్లోనే ఖర్చు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్య రంగంపైనా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం మొదటి వారంలో ఖర్చు చేసిన 11.3 బిలియన్ డాలర్లు, పర్యావరణ పరిరక్షణ సంస్థ వార్షిక బడ్జెట్ అయిన 8.8 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
వివరాలు
ఖర్చులు తగ్గించే ప్రయత్నాలు..
అలాగే వ్యాధి నియంత్రణ కేంద్రానికి సుమారు 9.2 బిలియన్ డాలర్లు, నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు సుమారు 7.4 బిలియన్ డాలర్లు మాత్రమే సంవత్సరానికి కేటాయిస్తారు. అంటే ప్రజల ఆరోగ్యం, పర్యావరణ రక్షణ కోసం పనిచేసే సంస్థల కంటే యుద్ధ ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. శాస్త్ర పరిశోధనల విషయంలో కూడా ఇదే తేడా కనిపిస్తోంది. అమెరికాలో పరిశోధనలకు మద్దతు ఇచ్చే నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు కేటాయించే వార్షిక నిధులు కూడా యుద్ధం మొదటి వారంలో ఖర్చైన మొత్తానికి తక్కువగానే ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం వేల సంఖ్యలో పరిశోధన ప్రాజెక్టులను నిలిపివేస్తూ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.
వివరాలు
దారుణంగా పరిస్థితులు..
ఈ నేపథ్యంలో పెంటగాన్ కోరిన 200 బిలియన్ డాలర్ల నిధులు ఆమోదం పొందితే, రక్షణ ఖర్చులు మరింత పెరిగి ఇతర రంగాల మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుందని అంచనా. ఇప్పటికే అమెరికా రక్షణ విభాగం వార్షిక బడ్జెట్ 900 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఈ ఖర్చులపై కొంతమంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధానికి నిధులు ఇప్పటికే ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ సమర్థత పెంచే కార్యక్రమాల పేరుతో ఉద్యోగాల కోతలు, పరిశోధన గ్రాంట్ల రద్దు జరుగుతున్నాయి. మొత్తానికి అమెరికా ఖర్చుల ప్రాధాన్యతల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకవైపు యుద్ధ ఖర్చులు వేగంగా పెరుగుతుండగా, మరోవైపు విజ్ఞానం, ఆరోగ్యం, పరిశోధనల కోసం కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నాయి.