Indonesia: మళ్లీ బద్దలైన అనక్ క్రాకటా అగ్నిపర్వతం.. 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలోని సుందా జలసంధిలో ఉన్న అనక్ క్రాకటా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద, దట్టమైన పొగ వెలువడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం నుంచే క్రియాశీలంగా ఉన్న అగ్నిపర్వతం.. ఆదివారం తెల్లవారుజామున తొలిసారి పేలింది. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో మరో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. 8 విమానాశ్రయాలు మూసివేత అగ్నిపర్వతం నుంచి వెలువడిన దట్టమైన పొగ, బూడిద దేశంలోని పలు ప్రాంతాలను కమ్మేయడంతో అధికారులు 8 విమానాశ్రయాలను మూసివేశారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో సుమారు 1.7 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. విమానాల రాకపోకలకు అంతరాయం కొనసాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివరాలు
నౌకలకు హెచ్చరికలు
సుందా జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అగ్నిపర్వతం చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు.
ఈ ప్రాంతంలోకి స్థానికులు, పర్యాటకులు వెళ్లకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జకార్తా పరిధిలోని పాఠశాలలు, కళాశాలలను కూడా మూసివేశారు.
వేలాది మంది విమానాశ్రయాల్లోనే..
వరుసగా రెండో రోజు కూడా విమాన సర్వీసులు రద్దు కావడంతో దేశంలోని విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
ఆదివారం ఒక్కరోజే 746 దేశీయ, 272 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి.
సోమవారం 8 విమానాశ్రయాల్లో కలిపి 1,500కు పైగా విమాన రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికుల రాకపోకలకు భారీ అంతరాయం ఏర్పడింది.