Loading...
H1B visa fee: హెచ్-1బీ వీసాపై ట్రంప్‌కు మరో షాక్.. లక్ష డాలర్ల ఫీజుపై కోర్టు కీలక తీర్పు
హెచ్-1బీ వీసాపై ట్రంప్‌కు మరో షాక్.. లక్ష డాలర్ల ఫీజుపై కోర్టు కీలక తీర్పు

H1B visa fee: హెచ్-1బీ వీసాపై ట్రంప్‌కు మరో షాక్.. లక్ష డాలర్ల ఫీజుపై కోర్టు కీలక తీర్పు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్-1బీ (H-1B) వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫీజు చట్టబద్ధం కాదంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలన్న ట్రంప్ యంత్రాంగం అభ్యర్థనను అమెరికా అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. దిగువ కోర్టు తీర్పును నిలిపివేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ ప్రభుత్వం సమర్థవంతంగా నిరూపించలేకపోయిందని అప్పీల్స్ కోర్టు పేర్కొంది. దిగువ కోర్టు తీర్పు అమల్లో ఉండడం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం జరుగుతుందో ట్రంప్ యంత్రాంగం వివరించడంలో విఫలమైందని వ్యాఖ్యానించింది. అలాగే అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఇలాంటి ఫీజును ఏకపక్షంగా విధించే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది.

వివరాలు

ఏం జరిగింది?

గతేడాది సెప్టెంబరులో విదేశాల్లో ఉండి హెచ్-1బీ వీసాకు ఎంపికైన అభ్యర్థులు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

దిగువ కోర్టు తీర్పును సమర్థించిన అప్పీల్స్ కోర్టు

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చారు.

అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఈ ఫీజు విధించడంతో దానిని చట్టవిరుద్ధ పన్నుగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ట్రంప్ యంత్రాంగం అప్పీల్స్ కోర్టును ఆశ్రయించగా, అప్పీల్స్ కోర్టు కూడా దిగువ కోర్టు తీర్పునే సమర్థించింది.

వివరాలు

భారతీయులపై భారీ ప్రభావం

సాధారణంగా హెచ్-1బీ వీసాలకు సంబంధించిన ఖర్చులను అమెరికా కంపెనీలే భరిస్తుంటాయి. గతంలో ఈ వీసా ప్రక్రియకు సుమారు 2,000 నుంచి 5,000 డాలర్ల వరకు ఖర్చయ్యేది.

అయితే గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ఆ ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచింది. విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా అమెరికా కంపెనీలు స్థానిక అమెరికన్లను ఎక్కువగా నియమించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ పెంపు కారణంగా హెచ్-1బీ వీసాలపై అధికంగా ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులు, సంస్థలపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది.

ADVERTISEMENT