Brahmos: చైనాకు మరో షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియాకూ బ్రహ్మోస్ క్షిపణులు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్'కు అంతర్జాతీయ స్థాయిలో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే పలు దేశాలు ఈ అత్యాధునిక క్షిపణి కొనుగోలుపై ఆసక్తి చూపుతుండగా, తాజాగా వియత్నాంకు బ్రహ్మోస్‌ను విక్రయించేందుకు ఒప్పందం కుదిరినట్లు భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఫిలిప్పీన్స్ కూడా బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది. అదేసమయంలో ఇండోనేషియాతో కూడా ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. చైనా సమీపంలోని దేశాలు బ్రహ్మోస్‌పై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంపై తమకే అధికారం ఉందని చైనా చేస్తున్న వాదనల నేపథ్యంలో, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకునేందుకు ఈ క్షిపణి వ్యవస్థను ఎంపిక చేస్తున్నాయి.
వివరాలు
అధికారిక ప్రకటన వెలువడలేదు
సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో మాట్లాడిన రాజేష్ కుమార్ సింగ్, వియత్నాంతో బ్రహ్మోస్ ఒప్పందం ఇప్పటికే సంతకం అయినప్పటికీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని చెప్పారు. ఇండోనేషియాతో చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయని వివరించారు. వియత్నాంతో కుదిరిన ఈ ఒప్పందం విలువ సుమారు రూ.5,800 కోట్లుగా ఉంటుందని సమాచారం. భవిష్యత్తులో గగనతలం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ వెర్షన్‌ను కూడా వియత్నాం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అంతకుముందు 2022లో ఫిలిప్పీన్స్ సుమారు 375 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది.
వివరాలు
అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధించగలవు
త్వరలో ఇండోనేషియా కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది మాక్-3 వేగంతో, అంటే శబ్ద వేగానికి మూడింతల వేగంతో ప్రయాణించగలదు. భూమి, సముద్రం, గగనతలం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఉంది. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ప్రత్యేకత. ఈ ఒప్పందాల ద్వారా భారత్ ప్రాంతీయ వ్యూహాత్మక సమీకరణాల్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. పాకిస్తాన్‌కు సైనిక సహకారం అందిస్తూ భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలనే చైనా వ్యూహానికి ప్రతిస్పందనగా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేస్తూ భారత్ కూడా తన వ్యూహాన్ని అమలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.