Iran-US: ఇరాన్-అమెరికా వార్‌లో మరో ట్విస్ట్.. హర్మూజ్ జలసంధిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అగ్రరాజ్యం చర్యలపై టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా తాజా ఆంక్షలు స్వతంత్ర దేశాలన్నింటిపైనా యుద్ధం ప్రకటించినట్లేనని ఇరాన్ మండిపడింది. తాజా పరిణామాలు చూస్తుంటే వలసవాదం మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపిస్తోందని విమర్శించింది. ఇరాన్‌పై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. టెహ్రాన్‌కు సహకరించే వాణిజ్య భాగస్వామ్య దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘయీ తీవ్రంగా స్పందించారు.
వివరాలు
ఇది వలసవాదానికి నిదర్శనం
ఒక దేశ సార్వభౌమ పరిధిలో పనిచేస్తున్న బ్యాంకులు, సంస్థలు, విమానాశ్రయాలు ఇతర దేశాలతో వాణిజ్యం చేయకుండా అడ్డుకునే హక్కు అమెరికాకు లేదని బఘయీ అన్నారు.
ఇలాంటి చర్యల వల్ల దేశాలు తమ ఆర్థిక, రాజకీయ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకునే హక్కును కోల్పోతాయని పేర్కొన్నారు.
ఇది వలసవాదానికి నిదర్శనమని విమర్శించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇలాంటి సెకండరీ ఆంక్షలు చెల్లవని ఇరాన్ స్పష్టం చేసింది.
ప్రపంచ దేశాల సార్వభౌమత్వానికి అమెరికా చర్యలు పెను ముప్పుగా మారుతున్నాయని బఘయీ అన్నారు.
ఇలాంటి చర్యలు కేవలం అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణగా మిగలవని, అన్ని దేశాలపై యుద్ధం ప్రకటించినట్లవుతుందని హెచ్చరించారు. అమెరికా ఆంక్షలకు తాము దీటుగా బదులిస్తామని వెల్లడించారు.
వివరాలు
యుద్ధాన్ని ముగిస్తే మంచిది: పెజెష్కియాన్
తాజా పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందిస్తూ అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందనే విషయం అందరికీ తెలుసని అన్నారు.
ప్రస్తుతం తాము బలమైన, గౌరవప్రదమైన స్థితిలో ఉన్నామని పేర్కొంటూ.. ఇక యుద్ధాన్ని ముగించడం మంచిదని అభిప్రాయపడ్డారు.
ఇరాన్ గెలుపును ప్రపంచం గుర్తించిందని పెజెష్కియాన్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అమెరికా తమ పాఠశాలలు, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిందని ఆరోపించారు.
అందుకే ప్రపంచవ్యాప్తంగా అమెరికా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని విమర్శించారు.
వివరాలు
హర్మూజ్‌పై అమెరికాకు పూర్తి నియంత్రణ: ట్రంప్
మరోవైపు ఇరాన్‌పై ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ లభించిందని ఆయన పేర్కొన్నారు.
తన దృష్టిలో హర్మూజ్ ఇప్పుడు అమెరికా భూభాగమేనని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఒప్పందానికి సుముఖంగానే ఉన్నప్పటికీ సరైన ఒప్పందం చేసుకోలేకపోతోందని ట్రంప్ అన్నారు.
ప్రస్తుతం ఇరాన్ వద్ద నౌకాదళం, వాయుసేన లేవని, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. సైనికులకు జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని, 350 శాతం ద్రవ్యోల్బణంతో ఇరాన్ తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఎద్దేవా చేశారు.
అయితే ఇరాన్‌తో ఒప్పందానికి అమెరికా విధించే ప్రధాన షరతు ఒక్కటేనని ట్రంప్ స్పష్టం చేశారు. టెహ్రాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదని తేల్చిచెప్పారు.