Anthropic: అమెరికా డిమాండ్‌కు ఆంథ్రోపిక్ నో… ఏఐ సేఫ్టీ రూల్స్‌పై కఠిన వైఖరి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రభుత్వం చేసిన డిమాండ్లకు అక్కడి ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ తిరస్కారం తెలిపింది. యుద్ధాలు,గూఢచర్య కార్యకలాపాలకు సంబంధించి అమల్లో ఉన్న కృత్రిమ మేధ 'సేఫ్టీ రూల్స్'ను ఎత్తివేయాలని అమెరికా రక్షణ శాఖ కోరినప్పటికీ, ఆ అభ్యర్థనను అంగీకరించే ప్రసక్తే లేదని సంస్థ సీఈవో డారియో అమోడెయ్ (Dario Amodei) స్పష్టం చేశారు. తమ ఏఐ టూల్ 'క్లాడ్'లో అమలులో ఉన్న భద్రతా పరిమితులను తొలగించబోమని ఆయన తెలిపారు. అలాంటి నిర్ణయం తీసుకుంటే కృత్రిమ మేధ వినియోగం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికా ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చినా భద్రతా నిబంధనలను సడలించే ఆలోచన లేదని, తమ వైఖరిలో మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
Anthropicపై ఒత్తిడి తెచ్చేందుకు రక్షణ ఉత్పత్తి చట్టాన్ని వినియోగించాలనే ఆలోచన
ఈ అంశంపై పెంటగాన్‌తో జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి సాధ్యపడలేదని Dario Amodei పేర్కొన్నారు. అయితే సమీప భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వంతో మరిన్ని చర్చలు జరిగే అవకాశముందని తెలిపారు. 'క్లాడ్' ఏఐ సాధనాన్ని అమెరికా పౌరులపై గూఢచర్యం చేయడానికి గానీ, ప్రాణాంతక సైనిక చర్యల కోసం గానీ ఉపయోగించరాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఎటువంటి పరిమితులు లేకుండా ఏఐ సేవలను అందించాలనే ఉద్దేశంతో Anthropicపై ఒత్తిడి తెచ్చేందుకు రక్షణ ఉత్పత్తి చట్టాన్ని వినియోగించాలనే ఆలోచనలో Pete Hegseth ఉన్నట్లు సమాచారం.
వివరాలు
సైనిక అవసరాలకు అనుకూలమైన అంశాలు
ఇక ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన తాజా ఫీచర్లలో సైనిక అవసరాలకు అనుకూలమైన అంశాలు కూడా ఉన్నాయి. సున్నితమైన సమాచారాన్ని నిర్వహించే మిలిటరీ క్లాసిఫైడ్ వ్యవస్థల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక ఏఐ మోడల్ ఇదేనని తెలుస్తోంది. దీనిని గోప్య నిఘా కార్యకలాపాలు మరియు రక్షణ సంబంధిత అవసరాల కోసం వినియోగించే అవకాశం ఉంది. అందువల్ల చట్టబద్ధ ప్రయోజనాల నిమిత్తం ఏఐ మోడళ్లను ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలని, అదే సమయంలో యుద్ధాలు మరియు గూఢచర్యానికి సంబంధించిన 'సేఫ్టీ రూల్స్'ను తొలగించాలని రక్షణశాఖ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం,Anthropic మధ్య విభేదాలు స్పష్టమయ్యాయి.