Donald Trump: గ్రీన్‌లాండ్ విషయంలో వెనక్కి తగ్గను: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
మరో మాటకు తావులేకుండా గ్రీన్‌లాండ్ తమకే దక్కాలన్న పట్టుదలతో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో డెన్మార్క్, గ్రీన్‌లాండ్ నేతలు సంప్రదింపులు ప్రారంభించకముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా జాతీయ భద్రత కోణంలో గ్రీన్‌లాండ్ అత్యంత అవసరమని పేర్కొంటూ, సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని ట్రంప్ వెల్లడించారు. ఆ దీవి తమ అధీనంలోకి రావడానికి నాటో సభ్యదేశాలు ముందుకు రావాలని, అలా కాకపోతే రష్యా, చైనాలు అక్కడ పట్టు సాధించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వివరాలు
గ్రీన్‌లాండ్ ఎప్పటికీ నాటో పరిధిలోనే కొనసాగుతుంది
ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రదర్శిస్తున్న సామ్రాజ్యవాద ధోరణిని డెన్మార్క్, గ్రీన్‌లాండ్ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. డెన్మార్క్‌లో భాగమైన గ్రీన్‌లాండ్ ఎప్పటికీ నాటో పరిధిలోనే కొనసాగుతుందని వారు స్పష్టంగా చెప్పారు. వనరుల పరంగా కీలకమైన ఆర్కిటిక్ దీవిపై ట్రంప్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా తమ స్థిర నిర్ణయాన్ని వెల్లడించారు. గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించడానికి లేదా సైనికంగా జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తే, అది నాటో కూటమిలో తీవ్ర చీలికలకు దారితీసే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు.
వివరాలు
డెన్మార్క్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన
ఈ నేపథ్యంలో డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్, గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్‌లు పరస్పర సంఘీభావాన్ని ప్రకటించారు. శ్వేతసౌధంలో అమెరికాతో చర్చలకు ముందుగా డెన్మార్క్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కోపెన్‌హేగెన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో డెన్మార్క్ ప్రధాని మాట్లాడుతూ, "ప్రియమైన గ్రీన్‌లాండ్ ప్రజలారా... మేము ఈరోజు కలిసే ఉన్నాం, రేపూ కలిసే ఉంటాం" అని అన్నారు. అమెరికా, డెన్మార్క్‌ల మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే, యూరోపియన్ యూనియన్, నాటో కూటమి, డెన్మార్క్ రాజ్యాన్నే ఎంచుకుంటామని గ్రీన్‌లాండ్ ప్రధాని నీల్సన్ తేల్చిచెప్పారు.
వివరాలు
రష్యా, చైనాలు ఆక్రమించే ప్రమాదం
ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. గ్రీన్‌లాండ్ అమెరికాలో భాగం కాబోమని నీల్సన్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, "అది అతడి సమస్య. ఆ అభిప్రాయంతో నేను ఏకీభవించను. అతడి గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ డెన్మార్క్‌తోనే కొనసాగితే అది గ్రీన్‌లాండ్‌కే పెద్ద సమస్యగా మారుతుంది" అని ట్రంప్ అన్నారు. గ్రీన్‌లాండ్ తప్పకుండా అమెరికా భూభాగంలో చేరాల్సిందేనని పునరుద్ఘాటించిన ఆయన, లేదంటే ఆ ప్రాంతాన్ని రష్యా, చైనాలు ఆక్రమించే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ఆ దేశాల రక్షణ బలగాలు అక్కడ పాగా వేసాయని పేర్కొన్న ట్రంప్, తాను నిర్ణయిస్తే పెద్ద ఎత్తున అమెరికా సైన్యాన్ని అక్కడ మోహరించే సామర్థ్యం ఉందని కూడా వ్యాఖ్యానించారు.