
లండన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దొంగను పోలీసులు వెంటాడుతుండగా తెలుగు విద్యార్థి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో ఓ తెలుగు విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే లక్ష్యంతో ఓ యువకుడు విదేశాలకు తరలివెళ్లాడు. కాని విధి కన్నెర్ర చేయడంతో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాద సంఘటన బాధిత కుటుంబంలో పుత్రశోకాన్ని మిగిల్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని గొడవర్రు గ్రామానికి చెందిన 25 ఏళ్ల కిరణ్‌కుమార్ ఉన్నత విద్య అభ్యసించేందుకు (MASTER OF SCIENCE-MS) నిమిత్తం ఇంగ్లాండ్ దేశంలోని లండన్ పయనమయ్యాడు.
రాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు సుధీర్‌కుమార్ తపాలాశాఖలో విధులు నిర్వహిస్తున్నారు.
DETAILS
ప్రవాసీయుల సహకారంతో మృతదేహం తరలింపు
ఏలూరులో ఇంజినీరింగ్ చేశాక,రెండున్నర ఏళ్ల కిందట లండన్ వెళ్లిన కిరణ్ అక్కడ ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగ వేటలో పలు సబ్జెక్టుల్లో మెరుగైన పట్టు కోసం ప్రత్యేక కోర్సులకు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ మేరకు రోజు తరగతులకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే జూన్ 26న ద్విచక్రవాహనంపై తరగతికి హాజరయ్యేందుకు బైక్ పై బయల్దేరాడు. ఇదే సమయంలో అక్కడి పోలీసులు స్థానికంగా ఓ దొంగను వెంబడిస్తున్నారు. ఈ క్రమంలో సదరు నేరగాడు కారును వేగంగా నడిపిస్తూ కిరణ్‌ను బలంగా ఢీకొట్టాడు.
తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ను గుర్తించిన పోలీసులు, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. తోటి మిత్రుల సహకారంతో మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.