కెనడాలో ఘోరం.. బైక్ కోసం భారత విద్యార్థిని హత్య చేసిన దుండగులు
కెనడాలో భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ మేరకు ఒంటారియో ప్రావిన్స్ లో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ వైపు విద్య అభ్యసిస్తూనే, మరోవైపు జేబు ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న 24 ఏళ్ల విద్యార్థి గుర్విందర్ నాథ్ హత్య కలకలం సృష్టిస్తోంది. మిస్సిసాగాలో చదువుకుంటున్న గుర్విందర్ పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నారు.చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమవుతున్న గుర్విందర్, ఎంఎస్ పూర్తి కాగానే పిజ్జా దుకాణంతో వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఇటీవలే ఓ పిజ్జా ఆర్డర్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన గుర్విందర్ పై కొందరు వ్యక్తులు వెంబండించి తీవ్రంగా దాడి చేశారు.
ముందస్తు ప్రణాళికతోనే దుండగులు పిజ్జా ఆర్డర్ చేశారు : పోలీసులు
అనంతరం అతడి వాహనాన్ని ఎత్తుకెళ్లారు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 14న తుదిశ్వాస విడిచారు. ఘటనలో గుర్విందర్ శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాన్ని ఎత్తుకెళ్లాలన్న ముందస్తు ప్రణాళికతోనే దుండగులు పిజ్జా ఆర్డర్ చేసినట్లు విచారణలో భాగంగా పోలీసులు నిర్థారించారు. మరోవైపు దాడి జరిగిన ప్రాంతానికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో గుర్విందర్ వాహనాన్ని వదిలేసి నిందితులు పరారయ్యారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అక్కడి పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గుర్విందర్ మృతదేహాన్ని ఈ నెల 27న భారతదేశానికి తరలించనున్నారు. కుమారుడి అకాల మరణంతో బాధిత కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.