PoK Elections: పీవోకేలో పీఎంఎల్-ఎన్ ప్రభంజనం.. దశాబ్దం తర్వాత అధికారం దిశగా అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ ఆధిపత్యాన్ని చాటుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు,ఎన్నికల బహిష్కరణ పిలుపుల మధ్య నిర్వహించిన తొలి రెండు విడతల పోలింగ్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం 34 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలను పీఎంఎల్-ఎన్ గెలుచుకుని,దాదాపు పదేళ్ల తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బలమైన అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ముందు శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
వివరాలు
మిగిలిన 11 స్థానాలకు ఆగస్టు 10న పోలింగ్
అయితే ఆ పిలుపు ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు.
రాజధాని ముజఫరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదవడం విశేషం. దీంతో ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నట్లు స్పష్టమైంది.
భద్రతా పరిస్థితులు, భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహిస్తున్నారు.
పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
పీఎంఎల్-ఎన్, పీపీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.
అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఈ ఎన్నికల చివరి విడత పోలింగ్ ఆగస్టు 10న జరగనుంది.
మిగిలిన 11 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయిన అనంతరం తుది ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.