Loading...
Islamic Nato: పాక్,సౌదీ,టర్కీ కూటమిలో మునీర్‌కు కీలక పాత్ర.. అసలు వ్యూహమేంటి?
పాక్,సౌదీ,టర్కీ కూటమిలో మునీర్‌కు కీలక పాత్ర.. అసలు వ్యూహమేంటి?

Islamic Nato: పాక్,సౌదీ,టర్కీ కూటమిలో మునీర్‌కు కీలక పాత్ర.. అసలు వ్యూహమేంటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఇటీవల 'ఇస్లామిక్ నాటో'గా పిలుస్తున్న సైనిక కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ మేరకు మూడు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందం ప్రకారం.. కూటమిలోని ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే, దాన్ని మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించే విధంగా పరస్పర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఈ కూటమిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందనే వార్తలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ప్రాధాన్యమైన బాధ్యతలు కల్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

మునీర్‌కు కీలక పాత్ర?

ఇటీవల మూడు దేశాల మధ్య కుదిరిన సైనిక ఒప్పందంలో భాగంగా రక్షణ,విదేశాంగ మంత్రులతో పాటు ఆయా దేశాల సైనికాధిపతులతో కూడిన వ్యూహాత్మక సమన్వయ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య కుదిరిన సైనిక ఒప్పందంపై టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది.

మూడు దేశాల రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు, చీఫ్స్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లేదా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కమాండర్లతో కూడిన రాజకీయ, సైనిక సమన్వయ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ హోదాలో ఉన్నారు.

వివరాలు 

నాటో ఆర్టికల్-5 తరహాలో..

మూడు దేశాల సైనికాధిపతులకు కూటమి నిర్ణయాత్మక వ్యవస్థలో అధికారిక స్థానం కల్పించనుండటంతో.. మునీర్‌కు కూడా కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

అయితే 'ఇస్లామిక్ నాటో కమాండర్' పేరుతో ప్రత్యేకంగా ఒక పదవిని ఏర్పాటు చేసినట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ సైనిక ఒప్పందంపై టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ ఒప్పందం సాంకేతికంగా నాటోలోని ఆర్టికల్-5 తరహాలో ఉంటుందని ఆయన తెలిపారు.

నాటో ఆర్టికల్-5 ప్రకారం.. ఒక సభ్య దేశంపై దాడిని మొత్తం కూటమిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎందుకింత ప్రాధాన్యం?

కూటమి కార్యకలాపాల నిర్వహణ కోసం నాటో తరహాలో మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సౌదీ అరేబియాలో జనరల్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఫిదాన్ వెల్లడించారు.

తాజాగా టర్కీ రక్షణ శాఖ చేసిన ప్రకటనతో.. ఈ కూటమి పాలనా వ్యవస్థలో సైనికాధిపతులకు కూడా అధికారిక స్థానం కల్పించనున్న విషయం స్పష్టమవుతోంది.

పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య ఏర్పడుతున్న ఈ సైనిక భాగస్వామ్యంలో ఒక్కో దేశం ఒక్కో రకమైన బలాన్ని అందించనుంది.

పాకిస్థాన్‌కు భారీ సైనిక బలగాలు, సుదీర్ఘ సైనిక అనుభవం, రక్షణ ఉత్పత్తి సామర్థ్యంతో పాటు అణ్వాయుధ సామర్థ్యం ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఎందుకింత ప్రాధాన్యం?

2026 గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ గణాంకాలను ఉటంకిస్తూ అల్ జజీరా వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లో సుమారు 6.60 లక్షల మంది క్రియాశీల సైనిక సిబ్బంది ఉన్నారు.

టర్కీలో ఈ సంఖ్య దాదాపు 4.81 లక్షలు కాగా.. సౌదీ అరేబియాలో సుమారు 2.47 లక్షల మంది ఉన్నారు.

మూడు దేశాలను కలిపితే దాదాపు 14 లక్షల మంది క్రియాశీల సైనిక బలం ఉంటుంది.

పాకిస్థాన్ వద్ద సుమారు 1,397 సైనిక విమానాలు, 2,677 ట్యాంకులు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

మూడు దేశాలను కలిపితే 3,400కు పైగా విమానాలు, సుమారు 6,000 ట్యాంకులు, 344 నౌకాదళ వనరులు ఉన్నట్లు అంచనా.

వివరాలు 

ఎవరి బలం ఏంటి?

ఈ కూటమిలో పాకిస్థాన్ భారీ సైనిక మానవ వనరులు, సుదీర్ఘ సైనిక అనుభవం, రక్షణ రంగ సామర్థ్యంతో పాటు అణ్వాయుధ శక్తిని అందించగలదు.

టర్కీ తన అధునాతన రక్షణ పరిశ్రమ, డ్రోన్లు, క్షిపణులు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, నౌకాదళ సామర్థ్యాలతో పాటు నాటోలో పనిచేసిన అనుభవాన్ని తీసుకురానుంది.

సౌదీ అరేబియా మాత్రం భారీ ఆర్థిక వనరులు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, మౌలిక సదుపాయాల పరంగా కీలకంగా నిలవనుంది.

2026లో సౌదీ రక్షణ వ్యయం సుమారు 63.9 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా.

ఇది టర్కీ రక్షణ వ్యయం 51.4 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్ రక్షణ వ్యయం 9.1 బిలియన్ డాలర్ల కంటే గణనీయంగా ఎక్కువ.

వివరాలు 

మునీర్‌కు పెరగనున్న ప్రాధాన్యం?

ఈ కూటమి ఏర్పాటుతో పశ్చిమాసియా, మధ్యప్రాచ్య వ్యవహారాల్లో అసిమ్ మునీర్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేందుకు కూడా మునీర్ ప్రయత్నిస్తున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి.

పాకిస్థాన్‌ను 'ప్రాంతీయ స్థిరీకరణ శక్తి'గా చూపించేందుకు మునీర్ ప్రయత్నిస్తున్నట్లు కూడా విశ్లేషణలు ఉన్నాయి.

దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్‌మన్ అభిప్రాయం ప్రకారం.. ఈ ఒప్పందం ద్వారా మధ్యప్రాచ్యంలో పాకిస్థాన్ ప్రభావం పెరిగే అవకాశం ఉంది.

అయితే సౌదీ అరేబియా లేదా టర్కీకి సంబంధించిన ప్రతి యుద్ధంలో పాకిస్థాన్ తప్పనిసరిగా పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించడం సరికాదని కుగెల్‌మన్ విశ్లేషించారు.

వివరాలు 

భారత్ విషయంలో ఏం జరుగుతుంది?

మూడు దేశాల ఒప్పందంలోని'ఒకరిపై దాడి..అందరిపై దాడి' అనే నిబంధన నాటో ఆర్టికల్-5ను గుర్తు చేస్తోంది.

అయితే భవిష్యత్తులో పాకిస్థాన్,భారత్ మధ్య సైనిక ఘర్షణ జరిగితే.. సౌదీ అరేబియా నేరుగా పాకిస్థాన్ తరఫున యుద్ధంలోకి దిగే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు.

భారత్‌తో సౌదీ అరేబియాకు ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన వివరించారు.

మరోవైపు టర్కీ పాకిస్థాన్‌కు సైనికంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ..భారత్‌తో తన సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి అంకారా కూడా ప్రయత్నిస్తోంది.

అదే సమయంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన భారత్, పాకిస్థాన్ మధ్య వివాదంలో నేరుగా చిక్కుకోవడం టర్కీకి కూడా ప్రయోజనకరం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

అందువల్ల ఈ కూటమి భవిష్యత్తులో ఎలా పనిచేస్తుందనేది కీలకంగా మారనుంది.

వివరాలు 

పాకిస్థాన్‌కు దౌత్య బలమేనా?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న విశ్లేషణలను బట్టి చూస్తే.. ఈ కూటమి పాకిస్థాన్‌కు ప్రతి సందర్భంలోనూ తక్షణ సైనిక జోక్యానికి హామీ ఇచ్చే వ్యవస్థగా మారడం కంటే.. దౌత్యపరమైన రక్షణ, ప్రాంతీయ ప్రభావాన్ని పెంచుకునే వేదికగా మారే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

భవిష్యత్తులో ఏదైనా సంక్షోభం తలెత్తితే.. కొత్త మిత్రదేశాలతో ఉన్న కట్టుబాట్లు, అమెరికా నుంచి వచ్చే ఒత్తిడి, పాకిస్థాన్ సొంత వ్యూహాత్మక ప్రయోజనాల మధ్య అసిమ్ మునీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారనుంది.

ముఖ్యంగా భారత్‌తో సంబంధాల విషయంలో ఈ కూటమి భవిష్యత్ వైఖరి ఎలా ఉండబోతుందనేది కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT