Loading...
Australia: సోషల్ మీడియా అల్గోరిథమ్స్‌కు బ్రేక్.. యూజర్లకు ఆస్ట్రేలియా కీలక హక్కు
సోషల్ మీడియా అల్గోరిథమ్స్‌కు బ్రేక్.. యూజర్లకు ఆస్ట్రేలియా కీలక హక్కు

Australia: సోషల్ మీడియా అల్గోరిథమ్స్‌కు బ్రేక్.. యూజర్లకు ఆస్ట్రేలియా కీలక హక్కు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌లో తమకు ఎలాంటి కంటెంట్ కనిపించాలనే విషయంలో సోషల్ మీడియా వినియోగదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, టెక్ కంపెనీలు ఉపయోగించే వ్యక్తిగతీకరించిన సిఫారసు అల్గోరిథమ్స్‌ను నిలిపివేసే అవకాశాన్ని యూజర్లకు కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ఈ వారంలో ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

వివరాలు 

అల్గోరిథమ్‌ను ఆపే అవకాశం

ప్రతిపాదిత చట్టం అమల్లోకి వస్తే.. మెటా వంటి సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ సిఫారసు చేసే విధానంపై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇవ్వాల్సి రావచ్చు.

ప్రస్తుతం యూజర్ల ఆసక్తులు, ఆన్‌లైన్ ప్రవర్తన, వారు చూసే, ఇష్టపడే, పంచుకునే కంటెంట్‌ను విశ్లేషించి.. అందుకు అనుగుణంగా కొత్త పోస్టులు, వీడియోలు, ఇతర కంటెంట్‌ను సోషల్ మీడియా సంస్థలు సూచిస్తున్నాయి.

ఈ వ్యక్తిగతీకరణను నిలిపివేసే ఎంపికను యూజర్లకు అందించాలన్నది కొత్త ప్రతిపాదన ఉద్దేశం.

వివరాలు 

'ఎలాంటి కంటెంట్ చూడాలో వారే నిర్ణయించుకోవాలి'

ఆస్ట్రేలియా కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ ఈ ప్రతిపాదనపై స్పందిస్తూ.. తమ సోషల్ మీడియా ఫీడ్‌లో ఏం కనిపించాలనే విషయంలో ఆస్ట్రేలియన్లకు నిర్ణయాధికారం ఉండాలని అన్నారు.

వ్యక్తిగతీకరించిన అల్గోరిథమ్‌ను చాలామంది వినియోగదారులు ఇష్టపడుతున్నారని.. అది వారికి వినోదం లేదా ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తోందని చెప్పారు.

అయితే, టెక్ సంస్థలు ముందుగా యూజర్లకు ఎంపికను ఇవ్వడంతో పాటు.. వారు ఎంచుకున్న విధానాన్ని తప్పనిసరిగా గౌరవించాలని స్పష్టం చేశారు.

మెటా సహా టెక్ సంస్థలపై విమర్శలు

మెటా,స్నాప్, గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు తమ కంటెంట్ సిఫారసు వ్యవస్థల విషయంలో కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

వినియోగదారులు ఏం చూస్తున్నారు? దేనిపై ఆసక్తి చూపుతున్నారు? ఏ కంటెంట్‌ను ఇతరులతో పంచుకుంటున్నారు? వంటి అంశాలను అల్గోరిథమ్స్ నిరంతరం విశ్లేషిస్తాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఎక్కువ సమయం ప్లాట్‌ఫామ్‌లపైనే..

అనంతరం యూజర్ ఆసక్తులకు దగ్గరగా ఉండే మరిన్ని కంటెంట్‌ను వారి ఫీడ్‌లోకి తీసుకొస్తాయి.

ఇలాంటి వ్యక్తిగతీకరణ వల్ల వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువసేపు గడిపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో సంచలనాత్మకమైన లేదా తీవ్ర స్వభావం కలిగిన కంటెంట్‌కు కూడా అల్గోరిథమ్స్ అధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

దీంతో యూజర్లు ఎలాంటి కంటెంట్‌ను ఎంత మేరకు చూడాలనే అంశంపై వారి నియంత్రణ తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

యూజర్లకు మరిన్ని ఎంపికలు

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ఫీడ్‌పై వినియోగదారులకు మరింత అధికారం కల్పించడమే కొత్త ఆస్ట్రేలియన్ చట్టం లక్ష్యంగా కనిపిస్తోంది.

తమకు నచ్చిన కంటెంట్‌ను ఎలా చూడాలి? వ్యక్తిగతీకరించిన సిఫారసులు కావాలా? వద్దా? అనే విషయంలో యూజర్లకే నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

16 ఏళ్లలోపు పిల్లలపై ఇప్పటికే ఆంక్షలు

సోషల్ మీడియా విషయంలో ఆస్ట్రేలియా ఇప్పటికే కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది.

గత డిసెంబరులో 16 ఏళ్లలోపు పిల్లలు ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ తరహా చట్టాన్ని ప్రపంచంలోనే తొలిసారిగా అమలు చేసిన దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది.

వివరాలు 

ఇతర దేశాల్లోనూ కఠిన నిబంధనలు

ఆన్‌లైన్ బుల్లీయింగ్‌తో పాటు పిల్లలకు హాని కలిగించే కంటెంట్‌ను సిఫారసు చేసే అల్గోరిథమ్స్ నుంచి వారిని రక్షించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం.

ఆస్ట్రేలియా తరహాలోనే యూకే, ఫ్రాన్స్ సహా పలు దేశాలు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కఠిన నిబంధనలు తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నాయి.

అయితే, తాజాగా వెలువడిన డేటా ప్రకారం.. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు కొందరు పిల్లలు వయోపరిమితి ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగించేందుకు మార్గాలను కనుగొంటున్నారు.

దీంతో సోషల్ మీడియా నియంత్రణపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT