LOADING...
Baloch Leader: బలోచిస్థాన్ విషయంలోనూ వెనిజులా మోడల్ అమలు చేయాలి: అమెరికాను కోరిన బీఏసీ అధ్యక్షుడు తారా చంద్
అమెరికాను కోరిన బీఏసీ అధ్యక్షుడు తారా చంద్

Baloch Leader: బలోచిస్థాన్ విషయంలోనూ వెనిజులా మోడల్ అమలు చేయాలి: అమెరికాను కోరిన బీఏసీ అధ్యక్షుడు తారా చంద్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనిజులాలో నియంత పాలనకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను బలోచిస్థాన్ అంశంలోనూ అమలు చేయాలని బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ (బీఏసీ) అధ్యక్షుడు డాక్టర్ తారా చంద్ కోరారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో వ్యవహార శైలే ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్‌లోనూ కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అసీమ్ మునీర్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాను ఆయన కోరారు.

వివరాలు 

మునీర్ 'డబుల్ ఏజెంట్'

వెనిజులాలో మదురో తన దేశ సహజ వనరులను చైనాకు అప్పగించి దోపిడీకి మార్గం సుగమం చేశారని గుర్తు చేసిన తారా చంద్,అదే తీరున బలోచిస్థాన్‌లోని అపార ఖనిజ సంపదతో పాటు తీరప్రాంత వనరులను కూడా అసీమ్ మునీర్ చైనాకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మునీర్ 'డబుల్ ఏజెంట్'లా వ్యవహరిస్తూ, ఒకవైపు బలోచ్ వనరులను చైనా చేతుల్లోకి నెట్టుతూనే, మరోవైపు అమెరికాను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. మదురోపై అమెరికా చేపట్టిన మెరుపు ఆపరేషన్ తరహాలోనే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ సైన్యం బలోచిస్థాన్‌లో మాత్రమే కాకుండా, దేశ సరిహద్దులు దాటి కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇస్తోందని తారా చంద్ తీవ్రంగా విమర్శించారు.

వివరాలు 

బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా డాక్టర్ తారా చంద్

బలోచిస్థాన్‌లో ప్రతిరోజూ సామాన్య ప్రజల హత్యలు, బలవంతపు అదృశ్యాలు కొనసాగుతున్నాయని, ఇవి మానవత్వానికే మాయని మచ్చగా మారాయని పేర్కొన్నారు. గతంలో ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించినప్పటికీ,అదే పాకిస్థాన్ అమెరికా నుంచి ఆర్థిక సహాయం పొందిందన్న అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ బలోచిస్థాన్ స్వయం ప్రతిపత్తి లక్ష్యంగా ఉద్యమిస్తోంది. ఈసంస్థ అధ్యక్షుడైన డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తూ,బలోచ్ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ వేదికలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. వెనిజులాలో మదురోను అదుపులోకి తీసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement