Loading...
Baloch Prince: పాక్ ప్రభుత్వంతో రాజీ కోసం వచ్చిన యువరాజు అపహరణ.. బలూచిస్థాన్‌లో కలకలం
పాక్ ప్రభుత్వంతో రాజీ కోసం వచ్చిన యువరాజు అపహరణ.. బలూచిస్థాన్‌లో కలకలం

Baloch Prince: పాక్ ప్రభుత్వంతో రాజీ కోసం వచ్చిన యువరాజు అపహరణ.. బలూచిస్థాన్‌లో కలకలం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లోని అశాంతితో కూడిన బలూచిస్థాన్ ప్రాంతంలో కలాత్ రాజకుటుంబానికి చెందిన యువరాజు ప్రిన్స్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్‌జాయ్ కిడ్నాప్‌కు గురయ్యారు. కలాత్ సంస్థానానికి ప్రస్తుత ఖాన్ (రాజు) మీర్ సులేమాన్ దావూద్ ఖాన్ కుమారుడైన ఆయనను 2026 అక్టోబర్ 26, సోమవారం రాత్రి దుండగులు అపహరించారు. యువరాజుతో పాటు ఆయన భద్రత కోసం ఉన్న ముగ్గురు గన్‌మెన్లను కూడా కిడ్నాప్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఖుజ్దార్ నుంచి కలాత్ నగరానికి యువరాజు మొహమ్మద్ ఖాన్ అహ్మద్‌జాయ్ హైవేపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సూరాబ్,కలాత్ మధ్యలో ఆయుధాలు కలిగిన దుండగులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం యువరాజుతో పాటు ఆయనకు రక్షణగా ఉన్న ముగ్గురు బాడీగార్డులను తమతో తీసుకెళ్లి,గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు.

వివరాలు 

కలాత్ రాజకుటుంబానికి ప్రత్యేక గుర్తింపు

ఈ కిడ్నాప్ ఘటనపై క్వెట్టా పోలీస్ ప్రధాన కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది.

అయితే, ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ లేదా తిరుగుబాటు గ్రూపు ఈ అపహరణకు తామే బాధ్యులమని ప్రకటించలేదు.

దీంతో యువరాజు కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక బలూచ్ తిరుగుబాటు సంస్థల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

చారిత్రకంగా పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతాన్ని పాలించిన రాజులను 'ఖాన్ ఆఫ్ కలాత్'గా పిలుస్తారు.

ప్రస్తుతం ఈ రాజవంశానికి చెందిన మీర్ సులేమాన్ దావూద్ ఖాన్ గత కొన్నేళ్లుగా బ్రిటన్‌లోని లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు.

బలూచ్ ప్రజల్లో ఈ రాజకుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో పాటు గౌరవం కూడా ఉంది.

వివరాలు 

పాక్ ప్రభుత్వంతో రాజీ కోసం స్వదేశానికి తిరుగు ప్రయాణం

మీర్ మొహమ్మద్ ఖాన్ అహ్మద్‌జాయ్ తన తండ్రితో విభేదించి లండన్ నుంచి బలూచిస్థాన్‌కు తిరిగి వచ్చినట్లు సమాచారం.

పాకిస్థాన్ ప్రభుత్వంతో రాజీ కుదుర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన స్వదేశానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

తన తండ్రిలా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వైఖరిని అనుసరించకుండా, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ బలూచిస్థాన్‌లో శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే ఆయన లండన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు.

అయితే, శాంతి కోసం ప్రయత్నించాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగొచ్చిన యువరాజు కిడ్నాప్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన వెనుక బలూచ్ తిరుగుబాటు గ్రూపుల ప్రమేయం ఉందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ADVERTISEMENT