Balochistan: బలూచిస్థాన్‌లో సాయుధుల హల్‌చల్.. హైవేల దిగ్బంధం, పాక్ సైన్యంపై దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మరోసారి సాయుధుల హింసాత్మక చర్యలు కలకలం రేపాయి. పలు ప్రధాన జాతీయ రహదారులను దిగ్బంధించిన సాయుధులు.. పాకిస్థాన్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడులకు పాల్పడ్డారు. గురువారం కలత్, మస్తుంగ్, ఖరాన్, చాగై, వాషుక్ జిల్లాల్లోని హైవేలపై అడ్డంకులు ఏర్పాటు చేసి, వాణిజ్య వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. కలత్ ప్రాంతంలో ముందుకు వెళ్తున్న పాకిస్థాన్ సైనిక వాహనాల కాన్వాయ్‌పై సాయుధులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం ఎంతమేర జరిగిందనే వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు.
వివరాలు
ఖరాన్-కరాచీ హైవేపై భారీ వంతెనను ధ్వంసం చేసిన ఫైటర్స్
ఇదిలా ఉండగా.. ఖరాన్-కరాచీ హైవేపై సోత్కగన్ ప్రాంతంలోని ఓ వంతెనను భారీ యంత్రాలను ఉపయోగించి సాయుధులు ధ్వంసం చేశారు.
దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
మరోవైపు చాగై ప్రాంతంలో ఇరాన్ సరిహద్దు నుంచి వస్తున్న వాణిజ్య సరకు ట్రక్కులను ఫైటర్లు లక్ష్యంగా చేసుకున్నారు.
రెండు ట్రక్కులపై దాడి చేసి వాటికి నిప్పుపెట్టినట్లు సమాచారం. ఇటీవలే బలూచిస్థాన్‌లో పాక్ సైన్యంపై మరో దాడి జరిగినట్లు సమాచారం.
బుధవారం కలత్‌లోని మంగుచార్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఐఈడీ పేలుడులో ఆరుగురు పాకిస్థాన్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఆర్థిక దిగ్బంధనంలో భాగంగానే దాడులు జరుగుతున్నాయని వెల్లడి
అయితే, తాజాగా జరిగిన ఈ దాడులు, హైవేల దిగ్బంధానికి ఇప్పటివరకు ఏ సాయుధ సంస్థా బాధ్యత ప్రకటించలేదు.
గతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 'ఆర్థిక దిగ్బంధనం'కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఇరాన్ నుంచి చమురు, గ్యాస్‌ను తరలించే వాహనాలు, బలూచిస్థాన్ నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు రవాణా చేసే ట్రక్కులను సాయుధులు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ దాడుల వెనుక ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకోవాలన్న ఉద్దేశం ఉండొచ్చని వారు భావిస్తున్నారు.