Bangladesh: తల్లి అంత్యక్రియలకు ఐదు గంటల పెరోల్.. కన్నీటిపర్యంతమైన చిన్మయ్ కృష్ణదాస్
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలతో జైలులో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్‌కు అధికారులు ఐదు గంటల పాటు పెరోల్ మంజూరు చేశారు. అనారోగ్యంతో మృతిచెందిన ఆయన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ అనుమతి ఇచ్చారు. అయితే, బతికున్నప్పుడే కుమారుడిని చూడాలన్న తల్లి కోరిక నెరవేరకపోవడం అక్కడి వారిని కలచివేసింది. కనీసం అంత్యక్రియలకైనా కుమారుడు హాజరుకావడం భావోద్వేగానికి గురిచేసింది. 2024 నవంబర్‌లో అరెస్టు బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్ అధికార ప్రతినిధిగా ఉన్న చిన్మయ్ కృష్ణదాస్‌ను 2024 నవంబర్‌లో దేశద్రోహం కేసులో అరెస్టు చేశారు. జాతీయ జెండాను అగౌరవపరిచారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
వివరాలు
క్యాన్సర్‌తో తల్లి మృతి
చిన్మయ్ కృష్ణదాస్ తల్లి సంధ్యా రాణి ధర్ (71) క్యాన్సర్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో ఛటోగ్రామ్‌లోని హఠాజారి ఆశ్రమంలో గురువారం ఆమె కన్నుమూశారు. తన కుమారుడిని చూడాలన్న కోరిక ఆమెకు బలంగా ఉండేది.
ఆమెను కలిసేందుకు చిన్మయ్‌కు పెరోల్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు.
అయితే, అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శించేందుకు ఖైదీని విడుదల చేసే నిబంధన లేదని అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు.
దీంతో తల్లి బతికుండగానే కుమారుడిని చూడాలన్న ఆశ నెరవేరలేదు.
వివరాలు
మానవతా దృక్పథంతో పెరోల్
తల్లి మరణించిన అనంతరం ఛటోగ్రామ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ జహిదుల్ ఇస్లాం మియా ఈ విషయంపై స్పందించారు.
మానవతా దృక్పథంతో చిన్మయ్ కృష్ణదాస్‌కు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఐదు గంటల పెరోల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పెరోల్‌పై బయటకు వచ్చిన చిన్మయ్ దాస్, పుండరీక్ ధామ్ ఆలయంలోని రాధాకృష్ణ విగ్రహం పాదాలను తాకి కన్నీటిపర్యంతమయ్యారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తల్లి చివరి చూపునకు నోచుకోలేకపోయిన ఆయన, అంత్యక్రియల సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు ఆ దృశ్యాలు చూపించాయి.
వివరాలు
ఇతర కేసులు పెండింగ్‌లో..
చిన్మయ్ కృష్ణదాస్‌పై దేశద్రోహం కేసుతో పాటు, ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రభుత్వ ప్రాసిక్యూటర్ మరణానికి సంబంధించిన హత్య కేసు కూడా నమోదైంది.
కొన్ని కేసుల్లో ఆయనకు బెయిల్ లభించినప్పటికీ, మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటంతో జైలులోనే కొనసాగుతున్నారు.
తిరిగి జైలుకు..
తల్లి అంత్యక్రియలు పూర్తిచేసిన తర్వాత పెరోల్ గడువు ముగియగానే చిన్మయ్ కృష్ణదాస్ తిరిగి ఛటోగ్రామ్ సెంట్రల్ జైలుకు వెళ్లారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కుల కోసం పనిచేస్తున్న ఆయనకు పరిమిత కాలం మాత్రమే పెరోల్ లభించడం చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అంత్యక్రియలకు హాజరైన చిన్మయ్ కృష్ణదాస్
#Bangladesh
— Hindu Voice (@HinduVoice_in) September 10, 2026
Sri Chinmay Krishna Das Prabhu touched the feet of Radha-Krishna in Pundarik Dham temple of #Chattragram before taken to jail.
Sri Chinmay Krishna Das Prabhu was given only a few hours of parole to see his dead mother for the last time. pic.twitter.com/JcLKT8OF3F