Loading...
US Military: ఇరాన్‌పై కొత్త వ్యూహాలకు అమెరికా సిద్ధం.. సెంట్‌కామ్‌కు కీలక ఆదేశాలు
ఇరాన్‌పై కొత్త వ్యూహాలకు అమెరికా సిద్ధం.. సెంట్‌కామ్‌కు కీలక ఆదేశాలు

US Military: ఇరాన్‌పై కొత్త వ్యూహాలకు అమెరికా సిద్ధం.. సెంట్‌కామ్‌కు కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటివరకు ఆశించిన ఫలితం కనిపించడం లేదు. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన షరతులను ఇరాన్ అంగీకరించకపోవడంతో, టెహ్రాన్‌పై మరింత ప్రభావవంతమైన చర్యలు చేపట్టే మార్గాలపై అమెరికా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తమ బలగాలకు ప్రత్యేక ఈ-మెయిల్ పంపి, ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకునే వినూత్న, సంప్రదాయేతర వ్యూహాలపై సూచనలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచి, దాని అణు కార్యక్రమాలను నిలిపివేయించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

సెంట్‌కామ్ తమ బలగాలకు కొత్త వ్యూహాలపై సూచనలు కోరుతూ ఈ-మెయిల్

దీంతో ఇప్పటివరకు టెహ్రాన్‌పై అమలు చేసిన వ్యూహాలను సెంట్‌కామ్ అధికారులు మళ్లీ సమీక్షిస్తున్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై భారీ స్థాయిలో సైనిక దాడులు చేపట్టే అవకాశాన్ని హెచ్చరిక రూపంలో ప్రస్తావించారు.

అయితే సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ జోక్యంతో ఆ చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.

కాగా,ట్రంప్ హెచ్చరికలకు ముందుగానే సెంట్‌కామ్ తమ బలగాలకు కొత్త వ్యూహాలపై సూచనలు కోరుతూ ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఇదే చివరి అవకాశం: ట్రంప్

ఇరాన్‌ను తిరిగి చర్చల బల్లపైకి తీసుకురావాలనే లక్ష్యంతో అమెరికా గత కొన్ని వారాలుగా నిరంతర వైమానిక దాడులు కొనసాగిస్తోంది.

అయినప్పటికీ చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించకపోవడంతో, టెహ్రాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబించేందుకు అమెరికా సిద్ధమవుతోందని సమాచారం.

ఇరాన్‌కు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

అవసరమైతే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన దాడులకంటే తీవ్ర స్థాయిలో సైనిక చర్యలు చేపట్టేందుకు అమెరికా బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇదే చివరి అవకాశం: ట్రంప్

అయితే యుద్ధానికి ముగింపు పలకడానికి దౌత్య మార్గాలనే అనుసరించాలని ఇరాన్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ చేసిన విజ్ఞప్తిని గౌరవిస్తూ సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు.

ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఇరాన్ వినియోగించుకోకపోతే టెహ్రాన్‌పై మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు, మంగళవారం తెల్లవారుజామున కువైట్‌, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) డ్రోన్లతో దాడులు నిర్వహించినట్లు సమాచారం.

ADVERTISEMENT