Pakistan: క్వెట్టాలో బాంబు పేలుడు కలకలం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ దాడిలో 23 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్ల కలకలం చోటుచేసుకుంది. దేశంలోని బలుచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. బలుచిస్తాన్ లిబిరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) లక్ష్యంగా చేసుకుని జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిని బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ భారీ పేలుడులో కనీసం 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రైలు బోగీ పూర్తిగా ధ్వంసమైంది. అదేవిధంగా పట్టాల పక్కన ఉన్న పలు ఇళ్లు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.
వివరాలు
సహాయక చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది
ఆదివారం ఉదయం చమన్ గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి సైనిక సిబ్బందిని తీసుకెళ్తున్న సమయంలో దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బందే ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం వెంటనే రెస్క్యూ బృందాలు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జీయంద్ బలోచ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
దర్యాప్తు ప్రారంభించిన అధికారులు
ఇదే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును గతంలో కూడా బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుంది. గతంలో ఈ రైలును హైజాక్ చేసి, పాక్ ఆర్మీ అధికారులపై దాడులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. క్వెట్టా నుంచి పెషావర్‌కు ప్రయాణించే ఈ రైలులో తరచుగా ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణిస్తుండటంతో బీఎల్ఏ తరచూ దీనిని టార్గెట్ చేస్తోందని సమాచారం. తాజా పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.