Sydney: 150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం.. రూ.19 లక్షల జరిమానా!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుమారు 150 ఏళ్ల క్రితం గ్రంథాలయం నుంచి తీసుకెళ్లిన ఓ పుస్తకాన్ని ఒక పాఠకుడి వారసుడు తాజాగా తిరిగి గ్రంథాలయానికి అప్పగించాడు. ఈ సంఘటన అక్కడ ఆసక్తికరంగా మారింది. ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. తమ ఇంటి పునరుద్ధరణ పనులు జరుగుతుండగా చిమ్నీలోని ఓ చెక్కపెట్టెలో ఈ పుస్తకం లభించింది. అది తమ పూర్వీకులు గ్రంథాలయం నుంచి తీసుకెళ్లిన పుస్తకమని గుర్తించి, దానిని తిరిగి అప్పగించడం సరైన నిర్ణయమని భావించి గ్రంథాలయానికి తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. పుస్తకంపై ఉన్న తేదీలను పరిశీలించగా, అది 1870లో గ్రంథాలయం నుంచి తీసుకున్నట్లు తేలింది.
వివరాలు
ఆ మొత్తాన్ని వసూలు చేయం
అయితే, అంత పాత రికార్డులు ప్రస్తుతం తమ వద్ద లేవని గ్రంథాలయ నిర్వాహకులు తెలిపారు. అయినప్పటికీ, ఆ చారిత్రక పుస్తకాన్ని సంతోషంగా స్వీకరించినట్లు పేర్కొన్నారు.
గ్రంథాలయ నిబంధనల ప్రకారం ఈ పుస్తకానికి ఆలస్య రుసుము (ఫైన్) విధిస్తే సుమారు రూ.19 లక్షలవుతుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, ఆ మొత్తాన్ని వసూలు చేయబోమని స్పష్టం చేశారు.
అంతేకాదు ఇకపై ఈ పుస్తకాన్ని ఎవరికీ ఇవ్వం. మళ్లీ దాన్ని తిరిగి పొందడానికి మరో 150 ఏళ్లు వేచి ఉండలేం కదా! అంటూ గ్రంథాలయ సిబ్బంది సరదాగా వ్యాఖ్యానించడం అక్కడ నవ్వులు పూయించింది.