Canada : భారత్ వీసా సర్వీసుల పునరుద్ధరణపై కెనడా ఏమందో తెలుసా
తమ దేశంలో వీసాలను భారత్ హై కమిషన్ కార్యాలయం పున ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని కెనడా ప్రకటన చేసింది. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ -కెనడా మధ్య దౌత్యవివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య వీసా సేవలు తాత్కాలికంగా బంద్ అయ్యాయి. తాజాగా వీసాల అంశంలో కీలక పరిణామాలు జరిగాయి. రద్దైన వీసా సర్వీసుల్ని గురువారం నుంచి పునరుద్ధరించాలన్న భారత్ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. ఆందోళనకర కాలం తర్వాత భారత్ తాజా చర్య సానుకూల సంకేతమని, ఫలితంగా ఎందరో కెనడా వాసులకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ హర్షం వ్యక్తం చేశారు.
"కెనడా సర్కార్ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకున్నాకే పునరుద్ధరణ ప్రకటించాం"
భారత్‌తో దౌత్యపరమైన ఆందోళన భయాన్ని కలిగించిందని, ఇటువంటి పరిణామాల మధ్య రద్దు అనే మాట తొలి ప్రాధాన్యత కాకూడదన్నదే తమ అభిప్రాయమన్నారు. భారతదేశం మంచి నిర్ణయం తీసుకుందని మరో మంత్రి హర్జిత్ సజ్జన్ అన్నారు. అయినప్పటికీ ఈ నిర్ణయం వెనుక ఉన్న భారత్ ఉద్దేశం ఏమిటన్నది తమకు తెలియదని చెప్పుకొచ్చారు. భారత దౌత్యవేత్తల రక్షణ విషయంలో తాజాగా కెనడా సర్కార్ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకున్నాకే, భద్రతా పరిస్థితిని సమీక్షించినట్లు కెనడాలోని భారత్ హై కమిషన్ వెల్లడించింది. ఈ మేరకే ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు ప్రకటన చేసింది.