Canada: వలసదారుల కోటాలను భారీగా తగ్గిస్తున్న కెనడా
కెనడా ప్రభుత్వం వలసల నియంత్రణకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి వార్తాపత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ కథనాల ప్రకారం, 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా గుర్తించిన కెనడా, 2025లో ఈ సంఖ్యను 3,80,000కి మాత్రమే పరిమితం చేసింది. 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే దేశంలో ప్రవేశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వలసల కారణంగా నిరుద్యోగం.. దేశంలో ఇళ్ల కొరత
వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. సర్వేలు చూపిస్తున్న ప్రకారం, ప్రస్తుత ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనుకబడి ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరుగుతుండటంతో పాటు, దేశంలో ఇళ్ల కొరత కూడా తీవ్రమైపోయింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త ఆంక్షలను ప్రకటించింది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వర్కర్లకు పని అనుమతులపై కఠినమైన ఆంక్షలు తీసుకురానున్నట్లు సమాచారం. వలసదారుల సంఖ్యను మరింత తగ్గించడం కూడా ఈ నిర్ణయాల్లో భాగమే.