LOADING...
Russian Oil: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. రష్యా చమురుకి భారత్‌, చైనా వెనకడుగు: అమెరికా 
ట్రంప్‌ ఎఫెక్ట్‌.. రష్యా చమురుకి భారత్‌, చైనా వెనకడుగు: అమెరికా

Russian Oil: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. రష్యా చమురుకి భారత్‌, చైనా వెనకడుగు: అమెరికా 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌ యుద్ధానికి తెరపడే ప్రయత్నాల్లో భాగంగా రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అక్కడి ప్రధాన చమురు సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)తీసుకున్న ఆంక్షల నిర్ణయం తెలిసిందే. ట్రంప్‌ విధించిన ఈ చర్యలు రష్యా చమురు రంగాన్ని గట్టిగా తాకాయని తాజాగా అమెరికా ట్రెజరీ శాఖ స్పష్టం చేసింది. రష్యాలో కీలకమైన చమురు సంస్థలైన రోస్‌నెఫ్ట్‌ (Rosneft),లుక్‌ఆయిల్‌ (Lukoil)పై ట్రంప్‌ ప్రత్యక్ష ఆంక్షలు అమలు చేశారు. దీని ప్రభావంగా భారత్‌,చైనా వంటి ప్రధాన దిగుమతిదారులు వెనక్కి తగ్గడంతో రష్యా చమురు ధరలు క్షీణించినట్లు ట్రెజరీ శాఖలోని ఒక సీనియర్‌ అధికారి విలేకరులతో తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగించేందుకు రష్యా సాధిస్తున్న ఆర్థిక వనరులపై ఈ ఆంక్షలు ఒత్తిడి పెంచాయని పేర్కొన్నారు.

వివరాలు 

దేశంలో అతిపెద్ద చమురు కంపెనీలు

ముందుగా చేసుకున్న చమురు డీళ్లు రద్దు చేయడం లేదా నిలిపివేయడం ద్వారా ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు కొనుగోలుదారులు ప్రయత్నిస్తున్నారని చెప్పిన ఆ అధికారి, రోస్‌నెఫ్ట్‌, లుక్‌ఆయిల్‌ కంపెనీలతో సంబంధాలను ఎలా తగ్గించుకోవాలో సూచనలు కోరుతున్నవారూ ఉన్నారని వెల్లడించారు. రష్యా ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరుల్లో చమురు-గ్యాస్‌ ఎగుమతులు అగ్రస్థానంలో ఉంటాయి. వీటిలో రోస్‌నెఫ్ట్‌, లుక్‌ఆయిల్‌ దేశంలో అతిపెద్ద చమురు కంపెనీలుగా ఉన్నాయి. రష్యా చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వాటా ఈ రెండు సంస్థలదే. అక్టోబర్‌ 22న ట్రంప్‌ ఈ కంపెనీలపై ఆంక్షలు (US Sanctions On Russia) ప్రకటించడంతో పాటు, వాటి అనుబంధ సంస్థలతో లావాదేవీలు చేసే సంస్థలకూ శిక్షలు తప్పవని హెచ్చరించారు.

వివరాలు 

అమెరికా 28 అంశాలతో కూడిన శాంతి ప్రతిపాదన

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగించే దిశగా అమెరికా 28 అంశాలతో కూడిన శాంతి ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు వచ్చిన సమాచారం తెలిసిందే. ఈ ప్రతిపాదనలో ఉక్రెయిన్‌ కొన్ని ప్రాంతాలను వదులుకోవడం, సైన్యాన్ని తగ్గించడం వంటి అంశాలు ఉన్నాయని, అవి రష్యాకు అనుకూలంగా ఉన్నట్టు పేర్కొంటున్నారు. ఈ ప్రణాళిక ప్రతులు ఇప్పటికే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి చేరినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధికారికంగా ఏ ప్రకటన వెలువడలేదు.