ఆరు దశబ్దాల తర్వాత మొదటిసారి తగ్గిన చైనా జనాభా
1961 తర్వాత అంటే.. గత ఆరు దశాబ్దాల కాలంలో మొదటిసారి చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. 2021తో పోలిస్తే.. 2022లో జనాభా తగ్గినట్లు ఆ దేశ గణాంకాల విభాగం పేర్కొంది. చైనాలో ప్రస్తుతం 141.75కోట్ల జనాభా ఉన్నట్లు ప్రకటించింది. ఒక బిడ్డకు జన్మనివ్వాలన్న పాలసీ కారణంగా 1980-2015 మధ్య కాలంలో జనాభా పెరుగుదలలో తిరోగమనం ఏర్పడింది. అలాగే వారసత్వం కోసం మగ బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలన్న నిబంధన నేపథ్యంలో ప్రస్తుతం చైనాలో మహిళల కంటే పురుషులు అధిక సంఖ్యలో ఉన్నట్లు ఆ దేశ గణాంకాల విభాగం నివేదించింది. గతేడాది 95.6లక్షల జననాలు, 1.04కోట్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. మొత్తం మీద అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. 2022లో 8,50,000 జనాభా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
2023లో అత్యధిక జనాభా గల దేశంగా భారత్
జనాభా తగ్గుదల నేపథ్యంలో 2016లోనే చైనా ఒక బిడ్డ విధానానికి స్వస్తి పలికింది. అయినప్పటికీ ఆ దేశ ప్రజలు ఇంకా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఫలితంగా జనాభా పెరుగుదలలో పెద్దగా మార్పు కనపడటం లేదనేది స్పష్టమవుతోంది. చైనాలో పట్టణ జనాభాతో పోలిస్తే.. గ్రామీణ జనాభాలో భారీగా తగ్గుదల నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2022లో పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 64.6లక్షలు పెరిగింది. గ్రామీణ జనాభా 73.1లక్షలు తగ్గింది. చైనా జనాభాలో తగ్గుదల నమోదైన నేపథ్యంలో 2023లో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరిస్తుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది. భారత జనాభా 140కోట్లకు చేరొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.