చైనాపై పెరుగుతున్న ఆంక్షలు.. మరణాలపై తాజా డేటా ఇవ్వాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ
చైనాలో కరోనా విజృంభిస్తోంది. దీంతో బీజింగ్‌పై ఆంక్షలు విధించే దేశాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. యూకే, ఫ్రాన్స్, భారత్ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో చైనాలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలపై తాజాగా నివేదికలను అందించాలని చైనాను డబ్య్లూహెచ్ఓ కోరింది. ఇటలీలోని మిలన్ విమానాశ్రయంలో చైనా నుంచి ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 50 శాతం మందికి పాజిటిన్ అని తేలిందంటే.. ఆ దేశంలో మహమ్మారి వ్యాప్తి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో వైరల్ సీక్వెన్సింగ్, క్లినికల్ మేనేజ్‌మెంట్‌ను బలోపేతం చేయాలని చైనాను డబ్య్లూహెచ్ఓ సూచించింది. ఈ విషయంలో అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొంది.
చైనా నుంచి వస్తే.. నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి..
చైనా నుంచి ఇంగ్లాండ్‌కు వచ్చే ప్రయాణీకులు.. బయలుదేరడానికి రెండు రోజుల ముందు తీసుకున్న కరోనా నెగిటివ్ రిపోర్టును చూపించవలసి ఉంటుంది. జనవరి 5 నుంచి ఇది అమల్లోకి రానుంది. స్కాట్లాండ్, వేల్స్ లేదా నార్తర్న్ ఐర్లాండ్‌తో పాటు యూకే అంతటా ఈ నిబంధనలను అమలు చేయనునున్నారు. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు భారతదేశం, అమెరికా, జపాన్, ఇటలీ, తైవాన్ దేశాలు ఇప్పటికే కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. ఫ్రాన్స్, స్పెయిన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ దేశాలు కూడా నెగిటివ్ రిపోర్టు సమర్పించాకే తమ ప్రాంతాలకు రావాలని తేల్చి చెప్పాయి.