ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా
చైనాలో కరోనా విరవిహారం చేస్తోంది. దీంతో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన జాబితాలో ఉన్నాయి. ప్రయాణికులపై ఆంక్షలు విధించిడాన్ని చైనా తప్పుపట్టింది. చైనాను లక్ష్యంగా చేసుకొన్ని కొన్ని దేశాలు అశాస్త్రీయమైన ఆంక్షలను విధిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. మితిమీరిన ఆంక్షలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న ఈ ఆంక్షలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆంక్షలపై స్పందించిన మావో నింగ్ కరోనా కట్టడికి ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పలేదు.
అమెరికా కౌంటర్
ఆంక్షలపై ఘాటుగా స్పందించి చైనాకు అమెరికా కౌంటర్ ఇచ్చింది. తమ దేశ ప్రజలను రక్షించుకోవడానికి అందుకు సంబంధించిన చర్యలను తీసుకుంటున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ చెప్పారు. ఆంక్షల వెనుక ప్రతీకార కోణం లేదని వివరించారు. తాము అన్ని శాస్త్రీయ ఆధారంగానే చేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ డేటాను ప్రపంచ దేశాలతో చైనా పంచుకోకపోవడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూడేళ్లుగా ఇదే ధోరణితో వ్యవహరిస్తుండటంతో చైనాపై ఆంక్షల అస్త్రాన్ని ప్రపంచ దేశాలు ప్రయోగిస్తున్నాయి. చైనా మాత్రం.. తాము పారదర్శకంగానే ఉన్నట్లు సమర్థించుకుంటోంది. వైరస్ వ్యప్తి నేపథ్యంలో చైనాకు యూరోపియన్ యూనియన్ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్లను అందించేందుకు ముందుకొచ్చింది. చైనా వ్యాక్సిన్లను తీసుకోవడానికి అంగీకరించకపోవడం గమనార్హం.