గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులను తప్పుబట్టిన చైనా
గాజాపై ఇజ్రాయెల్ ప్రభుత్వం, మిలిటరీ చేస్తున్న భీకర యుద్ధంపై చైనా స్పందించింది. ఈ మేరకు గాజాలో ఆ దేశం జరుపుతున్న దాడులు ఆత్మరక్షణ స్థాయిని మించి ఉన్నాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు. గాజా ప్రజలపై ఇజ్రాయెల్ మారణహోమాన్ని నిలిపివేయాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ భయంకరమైన యుద్ధంగా మారకకుండా చూడాలని అమెరికా భావించింది. ఇందుకు చైనా సహకారం కోరిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, చైనా మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన మరుసటి రోజే డ్రాగన్ రంగంలోకి దిగింది. పరిస్థితిని తీవ్రతరం చేసేందుకు ఎవరైనా ఎటువంటి చర్యలూ తీసుకోకూడదన్నారు. సాధ్యమైనంత వేగంగా చర్చల దిశగా అడుగులు వేయాలని వాంగ్ యి సౌదీ విదేశాంగ మంత్రికి సూచించారు.
యుద్ధం ఆగాలంటే చర్చలు జరగాలి : చైనా
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించేందుకు కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం చైనా రాయబారి జై జున్, వచ్చే వారం పశ్చిమాసియాను పర్యటన చేయనున్నారు. అయితే పాలస్తీనా సమస్యను పరిష్కరించడంలో ఐక్యరాజ్యసమితి తన పాత్రను పోషించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభ్యర్థించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య ముగిసేందుకు ఏకైక మార్గం ఇరు దేశాలు చర్చలను ప్రారంభించడమేనని చెప్పారు. యుద్ధం ప్రారంభ దశలో సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం టూ- స్టేట్ ఫార్ములాగా చైనా పేర్కొంది. ఈ మేరకు డ్రాగన్ దేశం పాలస్తీనా స్వతంత్రానికి పిలుపునివ్వడం గమనార్హం. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చైనా స్పందన ఇజ్రాయెల్ వాసులను పరిగణలోకి తీసుకోకుండానే ప్రకటన చేసినట్టుందని అసంతృప్తి వ్యక్తం చేయడం కొసమెరుపు.