China: హిమాలయాల్లో మరో ముప్పు.. 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగే ప్రమాదం.. చైనా హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో వరదల బీభత్సం కొనసాగుతున్న వేళ.. మరో ప్రమాదం ముంచుకొస్తోందని చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది. హిమాలయ ప్రాంతంలో ఉన్న బ్యారియర్ సరస్సు రాబోయే 72 గంటల్లో ప్రమాదకరంగా పొంగిపొర్లే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే భారీ కొండచరియలు విరిగిపడటంతో టిబెట్‌లోని నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 558 మంది వరకు గల్లంతైనట్లు చైనా మీడియా వెల్లడించింది. దీంతో ఎగువ ప్రాంతాల్లో మరిన్ని ముప్పులు ఉండొచ్చని బీజింగ్ అధికారులు తాజా హెచ్చరిక జారీ చేశారు.
వివరాలు
నేపాల్ వైపు 100 మంది చైనా పౌరులు గల్లంతు
నేపాల్ వైపు దాదాపు 100 మంది చైనా పౌరుల ఆచూకీ తెలియడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.
మరోవైపు టిబెట్‌లోని గ్యిరోంగ్ సమీపంలో ల్హెండే నదిలోకి భారీగా మట్టి, రాళ్లు కొట్టుకొచ్చిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది.
ఈ ఘటనతో నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలు, పట్టణాలను వరద నీరు ముంచెత్తింది.
నేపాల్‌లోని దిగువ ప్రాంతాల్లో వరదల కారణంగా 177 మంది మరణించగా.. వందలాది మంది గల్లంతయ్యారు.
వరదల ఉద్ధృతికి ఇళ్లు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల నిర్మాణాలు కొట్టుకుపోయాయి.
వివరాలు
బ్యారియర్ సరస్సుపై పెరిగిన నిఘా
టిబెట్‌లోని ప్రమాద ప్రభావిత ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ క్రమంలో ఇద్దరు గ్రామస్థులను సహాయక బృందాలు రక్షించాయి.
వరదల పరిస్థితి నుంచి తేరుకోకముందే మరో ప్రమాదాన్ని చైనా ప్రభుత్వ మీడియా గుర్తించింది.
హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన ఏర్పడిన బ్యారియర్ సరస్సు క్రమంగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని వెల్లడించింది.
దీంతో చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ సరస్సుపై పర్యవేక్షణను మరింత పెంచింది.
ఈ బ్యారియర్ సరస్సు ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతానికి ఈశాన్య దిశలో ఉంది.
చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదులు కలిసే ప్రాంతంలో ఇది ఏర్పడింది. గురువారం నాటికి సరస్సులో దాదాపు 20లక్షల ఘన మీటర్ల నీరు ఉన్నట్లు అంచనా వేశారు.
వివరాలు
రంగంలోకి రెస్క్యూ బృందాలు
ఇప్పటికే నీరు సరస్సు నుంచి పొంగిపొర్లుతున్నట్లు చైనా అధికారులు గుర్తించారు.
రాబోయే మూడు రోజుల్లో మరో 30లక్షల ఘన మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్(సీసీటీవీ)తెలిపింది.
దీంతో సరస్సు మరింత ఉప్పొంగితే దిగువ ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాద పరిస్థితుల నేపథ్యంలో సహాయక చర్యలను చైనా ముమ్మరం చేసింది. బీజింగ్,చెంగ్డూ ప్రాంతాల నుంచి అగ్నిమాపక,రెస్క్యూ బృందాలను పంపించింది.
స్థానిక పోలీసులు,సాయుధ బలగాలతో కలిసి ఈ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
మరోవైపు గ్యిరోంగ్ పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా,కమ్యూనికేషన్ సేవలను అధికారులు పునరుద్ధరించారు.
అయితే పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇంకా పనిచేయడం లేదని సీసీటీవీ వెల్లడించింది.