China Nuclear Threat : జపాన్ నుంచి చైనాకు అణుముప్పు? పీఎల్‌ఏ నివేదికలో సంచలన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
చైనా నగరాలపై అణుముప్పు పొంచి ఉందా? జపాన్ వైపు నుంచే ప్రమాదం రావచ్చా? ఈ అంశాలపై చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) రాకెట్ ఫోర్స్ రూపొందించిన పరిశోధనా నివేదిక ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువేనని పేర్కొన్నప్పటికీ.. భౌగోళిక రాజకీయ పరిణామాలు, తీవ్రవాద సంస్థల కారణంగా చైనాలోని కీలక నగరాలపై క్షిపణి లేదా అణుదాడి జరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా జపాన్‌ను అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన 'ప్రధాన ప్రమాద సంకేతం'గా అందులో ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
జపాన్‌పై చైనా అనుమానాలేంటి?
జపాన్ అనుసరిస్తున్న కొన్ని విధానాలు అంతర్జాతీయ శాంతి, భద్రతకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని చైనా సైన్యం ఆరోపిస్తోంది.
2017లో ఆమోదమైన అణ్వాయుధాల నిషేధ ఒప్పందంపై జపాన్ ఇప్పటివరకు సంతకం చేయకపోవడాన్ని కూడా చైనా ప్రస్తావించింది.
అదే సమయంలో.. అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు, వాటిని తయారు చేయకూడదు, తమ భూభాగంలోకి వాటిని అనుమతించకూడదు అనే మూడు అణురహిత సూత్రాలను జపాన్ చాలా కాలంగా పాటిస్తోంది.
అయితే వీటిలో మార్పులు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తోందని చైనా ఆరోపిస్తోంది.
జపాన్ వద్ద రహస్యంగా వెపన్-గ్రేడ్ ప్లూటోనియం తయారు చేసే సామర్థ్యం ఉందని, అవసరమైతే చాలా తక్కువ సమయంలో అణ్వాయుధాలను అభివృద్ధి చేయగల సాంకేతిక, ఆర్థిక వనరులు కూడా ఉన్నాయని చైనా వర్గాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
అణుదాడి జరిగితే చైనా నగరాల పరిస్థితి ఎలా ఉంటుంది?
1945లో జపాన్‌లోని హిరోషిమాపై జరిగిన అణుదాడికి సంబంధించిన ఆధారాలు,అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించిన పీఎల్‌ఏ రాకెట్ ఫోర్స్.. ఒక నమూనా అధ్యయనాన్ని నిర్వహించింది.
చైనాలోని ఓ ప్రధాన నగరంపై ఒక్క తక్కువ సామర్థ్యం కలిగిన అణుదాడి జరిగినా.. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేసింది.
ఒక్క దాడితోనే ఊహించని స్థాయిలో ప్రాణనష్టం సంభవించడంతోపాటు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.
సాధారణ అణు ప్రమాదాలతో పోలిస్తే.. సైనిక చర్య లేదా తీవ్రవాదుల అణుదాడి కారణంగా ఏర్పడే తీవ్రమైన రేడియేషన్ గాయాలకు చికిత్స అందించడం వైద్య వ్యవస్థకు మరింత క్లిష్టంగా మారుతుందని నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక నెట్‌వర్క్
ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నట్లు పీఎల్‌ఏ నివేదిక సూచించింది.
అణుముప్పును ఎదుర్కొనేందుకు చైనా ఇప్పటికే 30కి పైగా ప్రత్యేక రెస్క్యూ బేస్‌లతో అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నివేదిక పేర్కొంది.
రేడియేషన్ ప్రమాదం సంభవించినప్పుడు అవసరమయ్యే యాంటీబయాటిక్స్,రేడియేషన్ రక్షణ పరికరాలు,ప్రత్యేక రక్షణ దుస్తులను ముందుగానే అందుబాటులో ఉంచాలని స్థానిక అధికారులకు సూచించింది.
అదే సమయంలో.. ఇలాంటి ఏర్పాట్ల వల్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, అశాంతి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రేడియేషన్ ముప్పు ఎదురైనప్పుడు అనుసరించాల్సిన రక్షణ చర్యలు, అత్యవసర ప్రోటోకాల్స్‌పై ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించాలని సిఫార్సు చేసింది.
ఇవన్నీ అణుముప్పును ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు సన్నాహాల్లో భాగమేనని పీఎల్‌ఏ పేర్కొంది.
వివరాలు
అణుయుద్ధంపై అంతర్జాతీయ హెచ్చరికలు
అమెరికాతో పాటు పీ-5 దేశాలు 2022లో అణుయుద్ధంపై కీలక ప్రకటన చేశాయి. 'అణుయుద్ధంలో విజయం సాధించలేం.. అలాంటి యుద్ధాన్ని ఎప్పటికీ ప్రారంభించకూడదు' అనే అభిప్రాయాన్ని ఆ దేశాలు ఉమ్మడిగా వ్యక్తం చేశాయి.
అయినప్పటికీ.. జపాన్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో అణు ముప్పును పూర్తిగా తోసిపుచ్చకుండా.. ముందస్తు రక్షణ, అత్యవసర స్పందన వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని పీఎల్‌ఏ సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది.