LOADING...
#NewsBytesExplainer: దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే!
దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే!

#NewsBytesExplainer: దేశాధినేతల మధ్య చెలరేగిన ఘర్షణలు.. చరిత్రలో నిలిచిపోయిన మాటల యుద్ధాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాషింగ్టన్‌లో శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశాధినేతల మధ్య అభిప్రాయ భేదాలు సహజమే అయినా ముఖాముఖి సమావేశాల్లో మాటకు మాట అనుకోవడం, సమావేశాన్ని నిరసనగా వదిలివెళ్లడం చాలా అరుదు. ఈ తరహా ఘర్షణలు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచ చరిత్రలో దేశాధినేతల మధ్య చోటుచేసుకున్న ఇటువంటి ఘర్షణలను ఓసారి పరిశీద్దాం.

Details

 1. రొనాల్డ్‌ రీగన్‌- గోర్బచేవ్‌ (1986) 

అమెరికా అధ్యక్షుడు రీగన్, సోవియట్‌ యూనియన్‌ అధినేత గోర్బచేవ్‌ ఐస్‌ల్యాండ్‌ రాజధాని రికోవిక్‌లో భేటీ అయ్యారు. ఆయుధ నియంత్రణ ఒప్పందం దాదాపుగా ఖరారైన సమయంలో క్షిపణి రక్షణ వ్యవస్థల అంశంపై భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఈ కారణంగా చర్చలు విఫలమయ్యాయి. అయితే, ఈ విఫలం భవిష్యత్తులో అణునిరాయుధీకరణ ఒప్పందాలకు దారితీసింది. 2. జార్జి డబ్ల్యు. బుష్‌- పుతిన్‌ (2001) స్లొవేనియాలో జరిగిన సమావేశంలో జార్జి డబ్ల్యు. బుష్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే, నాటో విస్తరణ, క్షిపణి రక్షణ వ్యవస్థల అంశాల చర్చకు రాగానే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తూర్పు ఐరోపాలో అమెరికా క్షిపణి మోహరింపుపై రష్యా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.

Details

 3. బరాక్‌ ఒబామా- నెతన్యాహు (2010) 

ఇజ్రాయెల్‌ జనావాసాల అంశంలో ఒబామా-నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. 2010లో శ్వేతసౌధంలో జరిగిన భేటీలో ఒబామా తన ప్రతిపాదనలు నెతన్యాహు అంగీకరించకపోవడంతో ఆగ్రహించి, చర్చల బాధ్యతను అధికారులకు అప్పగించి కుటుంబ సభ్యులతో కలిసి లంచ్‌కు వెళ్లిపోయారు. ఇది గంభీరమైన దౌత్యపరమైన సంకేతంగా మిగిలిపోయింది. 4. జిన్‌పింగ్‌- జస్టిన్‌ ట్రూడో (2022) జీ-20 సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బహిరంగంగానే కెనడా ప్రధాని ట్రూడోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు వీరిద్దరూ బాలీలో జరిగిన భేటీలో చర్చలు జరిపారు. ట్రూడో, చైనా కెనడా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని లీక్‌ కావడం జిన్‌పింగ్‌కు కోపం తెప్పించింది. ఈ ఘటన అంతర్జాతీయ దౌత్యవేత్తల దృష్టిని ఆకర్షించింది.

Details

 5. జాన్‌ ఎఫ్‌. కెనడీ- కృశ్చేవ్‌ (1961) 

ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా ఉన్న రోజుల్లో వియన్నాలో కెనడీ, సోవియట్‌ యూనియన్‌ అధినేత కృశ్చేవ్‌ భేటీ అయ్యారు. పశ్చిమ బెర్లిన్‌ నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లాలని కృశ్చేవ్‌ గట్టిగా హెచ్చరించడంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఈ సంఘటన తర్వాత బెర్లిన్‌ గోడ నిర్మాణానికి దారితీసింది. 6.ఇందిరా గాంధీ- రిచర్డ్‌ నిక్సన్‌(1971) బంగ్లాదేశ్‌ వివాదంపై ఇందిరా గాంధీ, అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ మధ్య విభేదాలు నెలకొన్నాయి. 1971లో శరణార్థుల సమస్య గురించి నిక్సన్‌ పట్టించుకోకపోవడంతో ఇందిరా గాంధీ తన ప్రసంగంలో ఘాటుగా స్పందించారు. దీనికి ప్రతీకారంగా నిక్సన్‌ ఆమెను 45 నిమిషాలు వేచిఉండేలా చేశారు. ఇటీవల ట్రంప్-జెలెన్‌స్కీ మధ్య జరిగిన ఘర్షణ కూడా చరిత్రలో చోటుచేసుకున్న ఇలాంటి సంఘటనల సరసన చేరింది.