కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు
చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ BF.7 వేరియంట్ విజృంభణతో చైనాలో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి . ముఖ్యంగా పట్టణాల్లో అయితే... కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒక్కో ప్రావిన్స్‌లో లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్స్ అయిన ఒక్క జెజియాంగ్‌లోనే రోజుకు 10లక్షలు నమోదవుతుండటం గమనార్హం. హెబీలోని ఆస్పత్రులకు కరోనా రోగులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రి కారిడార్, బెంచీలు, స్లాబులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. బెడ్లు సరిపోక ఆస్పత్రి సిబ్బంది రోగులను తిప్పి పంపుతున్నారు. రోగులకు తగ్గట్టు ఐసీయూలు లేకపోవడంతో... ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సకాలంలో ఐసీయూలో చేర్పించకపోవడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు.
మరణాల్లో చైనా తప్పుడు లెక్కలు..
ఆక్సిజన్ సరిపడ లేకనే... చైనాలో రోజుకు వేలాది మంది చనిపోతున్నట్లు ప్రపంచ మీడియా కోడై కుస్తోంది. కానీ చైనా మాత్రం ఆ మరణాలను చాలా వరకు తగ్గించి చూపిస్తోంది. చైనాలోని శ్మశానవాటికల వద్ద ఉన్న రద్దీని చూస్తే.. కరోనా మరణాలు భారీ సంఖ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐసీయూలు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్ నిల్వల కొరతల కారణంగానే చైనా భారీ సంఖ్యలో చనిపోతున్నారు. మరిణిస్తున్నవారిలో ఎక్కవగా వృద్ధులే ఉండటం గమనార్హం. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేసులు, మరణాలను చైనా చాలావరకు తగ్గించి చెబుతోంది. ఇప్పుడు కూడా అదే ధోరణిని అవలంబిస్తోంది. చైనాలో పరిమిత రోగనిరోధక శక్తి వల్లే... కేసులు భారీగా పెరుగుతున్నట్లు అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ స్టువర్ట్ కాంప్‌బెల్ రే చెబుతున్నారు.