
#NewsBytesExplainer: రేపే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్ కల సాకారమవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచం యుద్ధాల సంక్షోభంలో మునిగిపోతున్న ఈ సమయంలో, శాంతి గౌరవానికి ఎవరు అర్హులు అనే ప్రశ్న మళ్లీ నోబెల్ వేదికపై తలెత్తింది. 2025 అక్టోబర్ 10 శుక్రవారం, నార్వేలోని ఓస్లోలో నార్వేజియన్ కమిటీ ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును ప్రకటించనుంది. 338 మంది వ్యక్తులు,సంస్థలు ఈ బహుమతికి నామినేట్ కాగా, ప్రపంచ దృష్టి కొన్ని కీలక పేర్లపైనే నిలిచింది. వీరిలో ఒకరు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గాజా యుద్ధం ఆపి శాంతి ఒప్పందం కుదిర్చిన తర్వాత, ట్రంప్ స్వయంగా తనను "పీస్ ప్రెసిడెంట్"గా పిలుచుకున్నారు. సెప్టెంబర్ 29న వైట్ హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూసమక్షంలో, ఆయన 20 పాయింట్ల శాంతి ప్రణాళికను అందజేశారు.
వివరాలు
ట్రంప్ అరబ్, ముస్లిం దేశాలతో చర్చలు జరిపి హమాస్‌పై ఒత్తిడి
ఇజ్రాయెల్ పునరుద్ధరణకు అమెరికా సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నా, ప్రైవేట్‌గా మాత్రం ఒప్పందం చేసుకోక తప్పదని నెతన్యాహూను గట్టిగా హెచ్చరించారు. ట్రంప్ అరబ్, ముస్లిం దేశాలతో చర్చలు జరిపి హమాస్‌పై ఒత్తిడి పెంచారు. అక్టోబర్ 5లోపు ఒప్పందం కుదరని పరిస్థితిలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హమాస్‌కు స్పష్టమైన డెడ్‌లైన్ ఇచ్చారు. చివరికి హమాస్ వెనక్కి తగ్గి బందీల విడుదలకు అంగీకరించింది. ట్రంప్ తన మిత్రదేశాలైన పాకిస్థాన్, టర్కీతో సలహాలు చేసి ఈ ఒప్పందాన్ని ముందుకు నడిపించారు. వైట్ హౌస్ వర్గాల ప్రకారం, ట్రంప్ ఈ ఒప్పందాన్ని మధ్యప్రాచ్యంలో శాంతికి పెద్ద మార్పుగా భావిస్తున్నారు.
వివరాలు
నేను ఎనిమిది ఘర్షణలను ఆపాను. నోబెల్ బహుమతి నాకు రావాలి
"నేను ఎనిమిది ఘర్షణలను ఆపాను. నోబెల్ బహుమతి నాకు రావాలి" అని ఆయన ఇటీవల ఆశాభావం వ్యక్తం చేసారు. కానీ, నార్వేజియన్ విశ్లేషకులు మాత్రం ఆయనకు అవకాశం తక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు. కారణం, ట్రంప్ రాజకీయ బ్లాక్ మేలింగ్ విధానాలు నోబెల్ కమిటీకి తెలిసి ఉండటం. ఈ ఏడాది కమిటీ సాధారణంగా వివాదాస్పద వ్యక్తుల కంటే, శాంతి కోసం మౌనంగా, కృషిచేసిన వారిని గౌరవించే అవకాశం ఎక్కువ అని నార్వేజియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ హాల్వర్డ్ లైరా పేర్కొన్నారు.
వివరాలు
Nobel Peace Prize : రక్తపాతాలతో ఎరుపెక్కిన భూగోళం
గాజా, ఉక్రెయిన్, ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దులు, ఆఫ్రికాలో సూడాన్ యుద్ధం, ఆసియాలో థాయిలాండ్-కాంబోడియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచం ఈ ఏడాది రక్తపాతాలతో తల్లడిల్లింది. ఈ నేపథ్యంలో, నోబెల్ కమిటీ ఎంపిక చేసే గ్రహీత పేరు కేవలం బహుమతిగా కాకుండా, ప్రపంచానికి శాంతి సందేశంగా మారనుంది. ఈసారి దృష్టి రాజకీయ నేతల నుంచి మానవతా యోధుల వైపుకు మళ్లింది. ప్రధాన పోటీదారుల జాబితాలో కొన్ని పేర్లు అత్యంత చర్చనీయాంశంగా ఉన్నాయి: 1. సూడాన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్ (Sudan's Emergency Response Rooms): యుద్ధం, ఆకలి, విపత్తుతో బాధపడుతున్న ప్రజలకు సహాయం అందించి, వేల మందిని రక్షించిన స్వచ్ఛంద సేవకుల బృందం. ఇది శాంతి, మానవతా విలువలకు గొప్ప నమూనాగా పరిగణించబడుతోంది.
వివరాలు
2. యులియా నవాల్నయా (Yulia Navalnaya)
రష్యా ప్రతిపక్ష నేత దివంగత ఆలెక్సీనవాల్నీ భార్య. రష్యాలో ప్రజాస్వామ్యం,మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నందున ఆమెను పోటీదారుగా భావిస్తున్నారు. 3. ఆఫీస్ ఫర్ డెమోక్రాటిక్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ (ODIHR) ఎన్నికల పర్యవేక్షణ,ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న యూరోపియన్ సంస్థ. ఈ సంస్థకు నోబెల్ అవార్డు అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. 4. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గాజా,ఉక్రెయిన్ వంటి ఘర్షణల్లో మానవతా దృష్టికోణంతో స్పందించినందుకు ఆయన పేరు కూడా నోబెల్ బహుమతికి పరిగణనలో ఉంది. 5. UNHCR / UNRWA ప్రపంచవ్యాప్తంగా కోట్లాది శరణార్థులు,నిరాశ్రయులకు సహాయం అందిస్తున్న సంస్థలు.వీటికి ప్రతిసారీ నోబెల్ బహుమతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వివరాలు
6. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) & ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ICJ)
గాజా, ఉక్రెయిన్ యుద్ధాల్లో యుద్ధ నేరాలపై విచారణ జరిపినందుకు వీటికి కూడా శాంతి బహుమతి అవకాశం ఉంది. నోబెల్ చరిత్రలో అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకు నాలుగు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతి పొందారు: థియోడోర్ రూజ్‌వెల్ట్ (1906) వుడ్‌రో విల్సన్ (1919) జిమ్మీ కార్టర్ (2002) బరాక్ ఒబామా (2009)
వివరాలు
ఒబామా ఏం చేశాడో కూడా తెలియదు
ఒబామా కేవలం తొమ్మిది నెలలకే ఈ బహుమతి అందుకోవడం కూడా ట్రంప్ తీవ్ర అసహనానికి కారణమైంది. "ఒబామా ఏం చేశాడో కూడా తెలియదు, కానీ నాకు మాత్రం ఇవ్వలేదు" అంటూ ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ట్రంప్ లాంటి నాయకులు ఆశ చూపించినా, కమిటీ దృష్టి ఇప్పుడు నిజమైన మానవతాయోధులపై ఉంది. ఈ శుక్రవారం మధ్యాహ్నం 2:30 (భారత కాలమానం) ఓస్లో నుంచి వెలువడే ప్రకటనతో 2025లో శాంతికి ఎలాంటి నిర్వచనం వస్తుందో ప్రపంచం తెలుసుకుంటుంది.