Royal diamond necklace : మ్యూజియంలో భారీ చోరీ.. 200 క్యారెట్ల వజ్రాల హారం మాయం
ఈ వార్తాకథనం ఏంటి
యూరప్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న మ్యూజియం దోపిడీల పరంపరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రియాలోని 'మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్' (ఎంఏకే)లో శుక్రవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సాధారణ సందర్శకుల్లా టికెట్లు కొనుగోలు చేసి మ్యూజియంలోకి ప్రవేశించారు. అనంతరం సుమారు 200 క్యారెట్ల ప్లాటినం, వజ్రాలతో రూపొందించిన విలువైన హారాన్ని దొంగిలించి పరారయ్యారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ హారం విలువ కొన్ని మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుండగులు ముఖాలకు ఎలాంటి ముసుగులు ధరించకుండానే మ్యూజియంలోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారి కదలికలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
వివరాలు
వజ్రాల హారంలో 673 అరుదైన రత్నాలు..
ప్రదర్శన హాలులోకి వెళ్లిన ఇద్దరూ సుత్తితో డిస్‌ప్లే గ్లాస్ బాక్స్‌ను పగులగొట్టి, అందులో ఉన్న విలువైన హారాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజైనింగ్ సంస్థ 'వాన్ క్లీఫ్ అండ్ ఆర్పెల్స్' ఈ ప్రత్యేకమైన హారాన్ని రూపొందించింది.
ఇందులో మొత్తం 673 అరుదైన రత్నాలు ఉన్నాయి. ఈ సంస్థకు సంబంధించిన దాదాపు 500 కళాఖండాలను జూన్ నుంచి మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు.
వాటిలో ఈ హారం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 27 వరకు కొనసాగాల్సి ఉండగా.. చోరీ ఘటన తర్వాత దాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
వివరాలు
50కి పైగా చారిత్రక బంగారు వస్తువులు మాయం..
ఈ వజ్రాల హారానికి ఎంతో ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది. 1939లో ఈజిప్ట్ యువరాణి ఫైజా, ఇరాన్ షా మహమ్మద్ రెజా పహ్లావీ వివాహం సందర్భంగా ఆమె తల్లి, ఈజిప్ట్ మాజీ రాణి నజ్లీ ఈ హారాన్ని ధరించారు.
ఇదిలా ఉంటే.. యూరప్‌లో వరుసగా జరుగుతున్న మ్యూజియం దోపిడీలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గత అక్టోబర్‌లో పారిస్‌లోని లూవ్రే మ్యూజియంలో కేవలం 8 నిమిషాల్లోనే 102 మిలియన్ డాలర్ల విలువైన నగలు చోరీకి గురయ్యాయి.
అలాగే స్పెయిన్‌లోని విల్లేనా మ్యూజియంలో గురువారం తెల్లవారుజామున దుండగులు కేవలం నాలుగు నిమిషాల్లోనే 50కి పైగా చారిత్రక బంగారు వస్తువులను దోచుకెళ్లారు.