China: చైనాలో భీకర సుడిగాలి బీభత్సం.. 12వ అంతస్తు నుంచి ఎగిరిపడ్డ వ్యక్తి
ఈ వార్తాకథనం ఏంటి
చైనా మధ్య ప్రాంతంలోని హుబే ప్రావిన్స్‌ను భీకర సుడిగాలి అతలాకుతలం చేసింది. గంటకు గరిష్ఠంగా 260 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోగా, 331 మందికి పైగా గాయపడ్డారు. ఇళ్లు ధ్వంసమవడం, వాహనాలు బోల్తాపడటం, వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు చైనా అధికారిక వార్తా సంస్థ షిన్‌హువా వెల్లడించింది. హుబేలో మొత్తం 4,855కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆటోమొబైల్ తయారీ పరిశ్రమకు కేంద్రంగా పేరొందిన ఈ ప్రాంతంలో ఆస్తి నష్టం భారీగా నమోదైంది.
వివరాలు
ఐదుగురు మృతి
సుడిగాలి తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాల్లో హువాంగ్‌గాంగ్ నగరం ఒకటి. అక్కడ 30 ఏళ్ల వ్యక్తి తన 12వ అంతస్తులోని అపార్ట్‌మెంట్‌లో ఉండగా, బలమైన గాలులు అతడిని బయటకు లాగేశాయి. అతనితో పాటు సోఫా, అల్మారాలు వంటి ఇంటి సామగ్రి కూడా గాలిలో ఎగిరిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. అదే నగరంలో పలుచోట్ల భారీ ట్రక్కులు కూడా గాలుల ధాటికి సుమారు 30 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. సమీపంలోని ఎజౌ నగరంలో సుడిగాలి విరుచుకుపడుతున్న దృశ్యాలు వీడియోల్లో నమోదయ్యాయి. అక్కడ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
సహాయక చర్యలు చేపట్టేందుకు 3,000 మందికి పైగా సిబ్బంది
ఈ ప్రకృతి విపత్తుతో భారీ నష్టం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. బాధితులను రక్షించేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు 3,000 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. హుబే ప్రావిన్స్‌లో సుడిగాలులు చాలా అరుదుగా సంభవిస్తాయి. ఇక్కడ చివరిసారిగా 2021 మే నెలలో ఇలాంటి ఘటన నమోదైంది. ఈసారి టైఫూన్ "మైసాక్" ప్రభావం, ముందస్తు వర్షాకాల పరిస్థితులు కలిసివచ్చి ఈ తీవ్ర వాతావరణానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో చైనా దక్షిణ పశ్చిమంలోని గ్వాంగ్‌సీ ప్రాంతంలో భారీ వరదలు, వాయవ్యంలోని గాన్సు ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
వివరాలు
టైఫూన్ మైసాక్ కారణంగా గ్వాంగ్‌సీ ప్రాంతంలో వరదలు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మంగళవారం అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేయాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం నుంచి టైఫూన్ మైసాక్ కారణంగా గ్వాంగ్‌సీ ప్రాంతంలో వరదలు కొనసాగుతున్నాయి. ఈ వరదల్లో నలుగురు మరణించగా, మరో ఎనిమిది మంది ఆచూకీ ఇంకా లభించలేదు. 600 మందికి పైగా ప్రజలు ఇంకా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
వివరాలు
వరద నీటిలో 800కు పైగా పాములు
ఈ తుఫాను కారణంగా హెంగ్‌జౌ నగరంలో 24 గంటల్లో కురిసిన వర్షపాతం గత రికార్డులను అధిగమించింది. అక్కడి ఓ గ్రామంలో వరద నీటితో పాముల పెంపక కేంద్రం మునిగిపోవడంతో 800కు పైగా పాములు బయటకు వచ్చాయి. గ్రామమంతా మురుగు నీటిలో పాములు సంచరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక గ్రామస్థుడిని పాము కాటు వేయడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గ్రామస్థులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పాములను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. బయటకు వచ్చిన పాముల్లో చాలా వరకు నీటి పాములు, ఎలుక పాములు వంటి విషరహిత జాతులే ఉన్నప్పటికీ, అత్యంత విషపూరితమైన నాగుపాములు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.