Elon Musk: 'కొత్తగా మెడిసిన్‌లో చేరొద్దు'.. వైద్య విద్యపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వైద్య రంగ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడేళ్లలో టెస్లా రూపొందిస్తున్న 'ఆప్టిమస్' (Optimus) హ్యూమనాయిడ్ రోబోలు ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ వైద్యుల కంటే మెరుగైన శస్త్రచికిత్సలు నిర్వహించగలవని ఆయన పేర్కొన్నారు. పెద్దపెద్ద ఆపరేషన్లను కూడా అవి సునాయాసంగా పూర్తి చేయగలవని చెప్పిన మస్క్, ఈ నేపథ్యంలో కొత్తగా వైద్య విద్యలో చేరే విషయాన్ని విద్యార్థులు మరోసారి ఆలోచించాలని సూచించారు. ఎలాన్ మస్క్ తాజా వ్యాఖ్యలు వైద్య రంగంలో సాంకేతికత ఆధిపత్యంపై విస్తృత చర్చకు దారితీశాయి. ఆయన అంచనా ప్రకారం 2029 నాటికి టెస్లా 'ఆప్టిమస్ రోబోలు' మానవ సర్జన్‌ల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తాయి.
వివరాలు
మనషుల స్థానాన్ని భర్తీ చేయగలవు
ఆ తర్వాత కొద్ది కాలానికే అనేక వైద్య విధుల్లో మనుషుల స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి చేరుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మస్క్ అభిప్రాయం ప్రకారం రోబోట్లకు 12 ఏళ్ల పాటు కొనసాగే వైద్య విద్య, ప్రత్యేక శిక్షణ అవసరం ఉండదు. అవి అలసిపోకుండా నిరంతరం పనిచేయగలవు.
అవసరానికి అనుగుణంగా అపరిమితంగా విస్తరించే సామర్థ్యం కూడా వాటికి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైద్యుల కొరత, పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ మార్పు అనివార్యమని ఆయన పేర్కొన్నారు.
అయితే మస్క్ నిర్దేశించిన కాలపరిమితిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2029 నాటికే ఈ స్థాయి మార్పు సాధ్యమవుతుందన్న అంచనా ఎలాన్ మస్క్ శైలిలో చేసిన అత్యంత వేగవంతమైన జోస్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
వివరాలు
పూర్తి స్థాయిలో మార్పు రావడం చాలా కష్టం
వైద్య రంగంలో చట్టపరమైన నిబంధనలు, న్యాయపరమైన బాధ్యతలు, రోగుల విశ్వాసం వంటి అనేక కీలక అంశాలు ఉన్నందున అంత తక్కువ సమయంలో పూర్తిస్థాయి మార్పు రావడం చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు.
అయినప్పటికీ భవిష్యత్తులో అత్యున్నత స్థాయి వైద్య సేవలు మరింత మందికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం దేశాధ్యక్షులు పొందుతున్న స్థాయి వైద్య సేవల కంటే మెరుగైన చికిత్సను కూడా సాధారణ ప్రజలు పొందే దిశగా సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంటున్నారు.
ఈ సాంకేతిక విప్లవంలో కేవలం సంప్రదాయ మాన్యువల్ సర్జరీలపైనే ఆధారపడే వైద్యులు వెనుకబడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
వైద్య రంగంలో కొత్త శకం
సాంకేతికతను అందిపుచ్చుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌తో కలిసి పనిచేయడం నేర్చుకున్న వైద్యులే భవిష్యత్తులో ముందంజలో ఉంటారని అభిప్రాయపడుతున్నారు.
వైద్య వృత్తి పూర్తిగా అంతరించిపోదని, అయితే దాని స్వరూపం మాత్రం గణనీయంగా మారిపోతుందని, మానవ నైపుణ్యం-కృత్రిమ మేధస్సు కలయికతో వైద్య రంగంలో కొత్త శకం ఆరంభమయ్యే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.