Trump: ఇరాన్‌పై త్వరలోనే విజయం సాధిస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌పై యుద్ధంలో త్వరలోనే అమెరికా విజయం సాధిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశం ఉందని, దానిని తాను తోసిపుచ్చడం లేదని తెలిపారు. ఆదివారం 'ఫాక్స్ న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని ఆయన అంచనా వేశారు. టెహ్రాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకుండా చూడటమే అమెరికా ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.
వివరాలు
సైనికపరంగా చూస్తే మనం ఇప్పటికే విజయం సాధించాం
మధ్యంతర ఎన్నికలకు ముందే ఇరాన్‌పై సైనిక చర్యలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ట్రంప్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ఆ అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేదు.
''అలా దాడులు చేస్తామని నేను చెప్పదలచుకోలేదు. అయితే అది సాధ్యమే'' అని పేర్కొన్నారు.
ఇరాన్‌పై సైనిక ఒత్తిడి, ఆర్థిక ఆంక్షల ద్వారా అమెరికా లక్ష్యాలను సాధిస్తుందా? అనే ప్రశ్నకు.. రెండు మార్గాల్లోనూ అమెరికా పురోగతి సాధిస్తోందని ట్రంప్ చెప్పారు.
''సైనికపరంగా చూస్తే మనం ఇప్పటికే విజయం సాధించాం. అంతమాత్రాన మన ప్రయత్నాలను నిలిపివేశామని కాదు'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పడిపోయింది
ఆర్థిక ఒత్తిడి ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
ఇరాన్ కరెన్సీ విలువ భారీగా పడిపోయిందని, దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందని అన్నారు.
ఇరాన్‌లో ద్రవ్యోల్బణం దాదాపు 300 శాతానికి చేరిందని, తాను విన్న సమాచారం ప్రకారం అది 318 శాతంగా కూడా ఉండొచ్చని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థతో పాటు ఆ దేశ సైనిక సామర్థ్యం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ తెలిపారు.