Loading...
Zelenskyy: పుతిన్ వలలో చిక్కొద్దు.. భారత్ సహా 47 దేశాలకు జెలెన్‌స్కీ పిలుపు
పుతిన్ వలలో చిక్కొద్దు.. భారత్ సహా 47 దేశాలకు జెలెన్‌స్కీ పిలుపు

Zelenskyy: పుతిన్ వలలో చిక్కొద్దు.. భారత్ సహా 47 దేశాలకు జెలెన్‌స్కీ పిలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యా విదేశీ దేశాలకు చెందిన పౌరులను కూడా సైనికులుగా ఉపయోగించుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. భారత్ సహా 47 దేశాల పౌరులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 23న న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ)లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఘనా,నేపాల్,తజికిస్థాన్, భారత్, యెమెన్, కెన్యా, జింబాబ్వే, క్యూబా, బెలారస్, సూడాన్, దక్షిణాఫ్రికా తదితర దేశాల పౌరులు రష్యా యుద్ధంలో ఉన్నారని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా మోసపూరిత పద్ధతులు, వివిధ రకాల ఎత్తుగడల ద్వారా విదేశీయులను తమ దేశానికి తీసుకెళ్లి యుద్ధంలోకి దింపుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వివరాలు 

భారతీయుల విషయంలోనూ జెలెన్‌స్కీ వ్యాఖ్యలు

47దేశాల ప్రతినిధులను ఉద్దేశించి జెలెన్‌స్కీ నేరుగా విజ్ఞప్తి చేశారు.

''రష్యా మీ పౌరులతో ఏం చేస్తోందో మీకు తెలుసు.వారు మీ దేశ ప్రజలు. వారిని జాగ్రత్తగా చూసుకోండి. మరో యుద్ధ రంగంలోకి వెళ్లకుండా చూడండి. పుతిన్ మిమ్మల్ని ఈ యుద్ధంలోకి లాగకుండా అడ్డుకోండి''అని అన్నారు.

రష్యా తన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు విదేశీ పౌరులను ఉపయోగించుకుంటోందన్నది ఆయన ఆరోపణ.

భారతీయుల విషయంలోనూ జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు.

రష్యా సైన్యంలో 227మంది భారతీయులు చేరినట్లు ఈ నెలలో భారత విదేశాంగ శాఖ తెలిపింది.

వారిలో 139మందిని ఇప్పటికే విడుదల చేసినట్లు,51మంది మరణించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వెల్లడించారు.

మిగిలిన భారతీయులను విడుదల చేసి స్వదేశానికి తీసుకురావడానికి మాస్కోతో భారత్ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

రష్యా ఆర్థికవ్యవస్థపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది: జెలెన్‌స్కీ

ఉత్తర కొరియాతో రష్యా కొనసాగిస్తున్న సైనిక సహకారంపైనా జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.

రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను పంపుతోందని ఆయన ఆరోపించారు.

ఇటీవల ఉక్రెయిన్ దళాలు ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నాయని, అనంతరం వారిని దక్షిణ కొరియాకు అప్పగించినట్లు చెప్పారు.

మరోవైపు ఉక్రెయిన్ తన రక్షణ భాగస్వామ్యాలను విస్తరిస్తోందని జెలెన్‌స్కీ తెలిపారు.

ఫిన్‌లాండ్‌తో డ్రోన్‌లకు సంబంధించిన ఒప్పందం,ఆస్ట్రేలియాతో భద్రతా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

రష్యా యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని పరిమితం చేసేందుకు అంతర్జాతీయ సమాజం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చే సామర్థ్యాన్ని తగ్గించేందుకు ఆ దేశ ఆర్థికవ్యవస్థపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని కూడా తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ADVERTISEMENT