LOADING...
Kuwait: కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం
ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం

Kuwait: కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్‌ డ్రోన్‌ దాడులతో వరుసగా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా కువైట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని మరోసారి దాడి జరిపింది. అయితే ఆ డ్రోన్‌ నేరుగా లక్ష్యాన్ని తాకకుండా ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆయిల్‌ ట్యాంకర్‌ ఒక్కసారిగా మంటల్లో కూరుకుపోయింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో పాటు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే అత్యవసర సేవలను అలర్ట్‌ చేశారు.

వివరాలు 

కొంతమేర ఆస్తి నష్టం జరిగినప్పటికీ పరిస్థితి అదుపులోనే..

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అగ్నిమాపక బృందాలు నిరంతరం శ్రమించి మంటలను నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. కొంతమేర ఆస్తి నష్టం జరిగినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్‌ నుంచి దూసుకొచ్చిన పలు క్షిపణులు, డ్రోన్‌లను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్‌ భద్రతా దళాలు వెల్లడించాయి. దాడి సమయంలో పలు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అధికారులు జారీ చేసే సూచనలు, భద్రతా మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.

Advertisement