LOADING...
Dubai: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడి.. విమానాలు తాత్కాలికంగా నిలిపివేత
విమానాలు తాత్కాలికంగా నిలిపివేత

Dubai: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడి.. విమానాలు తాత్కాలికంగా నిలిపివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 16, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, పలు దేశాలపై ఇరాన్‌ దాడులను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్‌ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక డ్రోన్‌ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పరిణామాల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు, విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. ప్రయాణికులు మరియు విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ నోటీసులు జారీ చేశారు. తమ విమానాల పరిస్థితిపై తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్ సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.

వివరాలు 

విమానాల మళ్లింపు..

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన, అక్కడి నుంచి బయల్దేరాల్సిన పలు విమానాలను అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ఇంధన ట్యాంక్‌కు అంటుకున్న మంటలను అదుపులోకి తేవడానికి దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వివరాలు 

భద్రత కట్టుదిట్టం..

ఇంధన ట్యాంక్‌పై దాడి జరిగిన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని ఇతర కీలక మౌలిక సదుపాయాల వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వెనక్కి చేరిన ఎమిరేట్స్ విమానం.. సోమవారం తెల్లవారుజామున కొచ్చి నుంచి దుబాయ్‌కు బయల్దేరిన ఎమిరేట్స్ విమానం, దుబాయ్ విమానాశ్రయం మూసివేసినట్లు సమాచారం అందడంతో తిరిగి కొచ్చికి చేరుకుంది. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఈ సమాచారం అందడంతో జాగ్రత్త చర్యగా దానిని వెనక్కి మళ్లించినట్లు అధికారులు వివరించారు.

Advertisement