Dubai real estate firm: ఉద్యోగినికి రూ.4 కోట్ల లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చిన బాస్!.. ఇంటర్నెట్‌లో చర్చ!
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తన ఉద్యోగిని ప్రతిభకు అరుదైన గుర్తింపు ఇచ్చింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఓ మహిళా ఉద్యోగినికి ఏకంగా రూ.4 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్ కారును బహుమతిగా అందించింది. రెండేళ్లలోనే 500 మిలియన్ డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ అమ్మకాలను పూర్తి చేసినందుకు ఈ బహుమతి ఇచ్చింది. భారత కరెన్సీలో ఈ అమ్మకాల విలువ సుమారు రూ.4,400 కోట్లు. ఆమె సాధించిన విజయానికి గుర్తింపుగా కంపెనీ సీఈవో ఈ ఖరీదైన కారును అందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
అవార్డు ఇస్తున్నారని భావిస్తే.. ఏకంగా లంబోర్గిని గిఫ్ట్!
దుబాయ్‌లోని రిచ్‌కీ ప్రాపర్టీస్ (Richkey Properties) రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో దబాన్ ఉత్మాన్ తన కంపెనీలో పనిచేస్తున్న ఏజెంట్ నటాలియా చావెజ్‌కు ఈ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.
కంపెనీ మూడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ కార్యక్రమానికి హాజరైన నటాలియాను సీఈవో వేదికపైకి పిలిచి ఓ ట్రోఫీ అందించారు.
దీంతో అవార్డు తీసుకున్న ఆమె తిరిగి తన సీటు వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అయితే, సీఈవో ఆమెను మధ్యలోనే ఆపారు. 'నటాలియా.. ఎక్కడికి వెళ్తున్నావు? కార్యక్రమం ఇంకా పూర్తికాలేదు' అంటూ అక్కడే ఉండాలని సూచించారు.
అనంతరం కౌంట్‌డౌన్ ఇచ్చి, అక్కడ ఏర్పాటు చేసిన రిబ్బన్‌ను తొలగించారు.
వివరాలు
రెండేళ్లలో రూ.4,400 కోట్ల రియల్ ఎస్టేట్ అమ్మకాలు!
దీంతో అక్కడున్న నీలం రంగు లంబోర్గిని ఉరుస్ కారు కనిపించింది. దాన్ని చూసిన నటాలియా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
కేవలం ట్రోఫీతోనే సరిపెడతారని భావించిన ఆమెకు రూ.4 కోట్ల విలువైన కారు బహుమతిగా లభించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
నటాలియా చావెజ్‌కు ఇంతటి ఖరీదైన బహుమతి రావడానికి ఆమె పనితీరే ప్రధాన కారణం.
గత రెండేళ్లలో ఆమె 500 మిలియన్ డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ అమ్మకాలను విజయవంతంగా పూర్తి చేశారు.
మన కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.4,400 కోట్లకు సమానం. అమ్మకాల విషయంలో అసాధారణ ప్రతిభ కనబరిచి కంపెనీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
వివరాలు
రెండేళ్లలో రూ.4,400 కోట్ల రియల్ ఎస్టేట్ అమ్మకాలు!
2026 మొదటి త్రైమాసికంలో కంపెనీ అమ్మకాల జాబితాలో ఆమె మూడో స్థానంలో నిలిచారు.
ఆ తర్వాత రెండో, మూడో త్రైమాసికాల్లో అగ్రస్థానంలో నిలిచి టాప్ పెర్ఫార్మర్‌గా గుర్తింపు పొందారు.
ఈ ఏడాది కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగినిగా ఎంపికయ్యారు.
ఆమె సాధించిన విజయాలను గుర్తించిన సంస్థ మొత్తం నాలుగు ప్రధాన అవార్డులను అందించింది.
వీటితో పాటు రూ.4 కోట్ల విలువైన లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చి సత్కరించింది.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కారు బహుమతి వీడియో
నటాలియాకు లంబోర్గిని కారును బహుమతిగా అందిస్తున్న వీడియోను రిచ్‌కీ ప్రాపర్టీస్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
కష్టపడి పనిచేస్తే ఎంతటి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయో ఈ ఘటన తెలియజేస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.
మరోవైపు రెడిట్‌లో ఈ ఘటనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా ఆదాయం సంపాదించే అవకాశాలు ఉండటంతో చాలామంది ఈ రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ రంగంలో సంపాదన అనుకున్నంత సులభం కాదని మరికొందరు పేర్కొంటున్నారు.
సాఫ్ట్‌వేర్ వంటి ఉద్యోగాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్‌లో ఆదాయం స్థిరంగా ఉండదని చెబుతున్నారు.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కారు బహుమతి వీడియో
కొన్నిసార్లు నెలల తరబడి కమీషన్ కూడా రాకపోవడంతో బ్రోకర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు.
రెండేళ్ల వ్యవధిలోనే 500 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు పూర్తి చేయడం సాధారణ విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నటాలియా కష్టానికి, ప్రతిభకు ఈ లంబోర్గిని బహుమతి తగిన గుర్తింపని ప్రశంసిస్తున్నారు.
మొత్తంగా ఓ ఉద్యోగిని తన పనితీరుతో సాధించిన అసాధారణ విజయం, అందుకు ప్రతిఫలంగా లభించిన కోట్ల విలువైన కారు ఇప్పుడు దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.