France: 303 మంది భారతీయులతో వెళ్తున్న విమానాన్ని చుట్టుముట్టిన ఫ్రాన్స్.. కారణం ఇదే..
303 మంది భారతీయ పౌరులతో దుబాయ్ నుంచి సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాకు వెళ్తున్న ఏ340 విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ఈ కేసులో ఫ్రాన్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ విమానాన్ని మనుషుల అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నట్లు ఫ్రెంచ్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆదేశాలను అనుసరించి విమానాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. భారతీయులు వెళ్తున్న ఈ విమానం రొమేనియాకు చెందిన చార్టర్డ్ కంపెనీది.
అమెరికా లేదా కెనడాకు అక్రమంగా తరలింపు?
సెంట్రల్ అమెరికాలో నికరాగ్వా అనేది అతిపెద్ద దేశం. న్యూయార్క్ రాష్ట్రం కంటే విస్తీర్ణంలో కొంచెం పెద్దగానే ఉంటుంది. అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వారికి ఈ దేశం స్వర్గధామంగా చెబుతుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది అక్రమ వలసదారులు ఈ దేశం గుండా అమెరికా-మెక్సికో సరిహద్దుకు చేరుకుంటారు. అక్రమ వలసదారులు కూడా ఈ మార్గంలో అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. నికరాగ్వాలో వలసదారులపై ప్రత్యేక నిఘా అంటూ ఏమీ ఉండదు. అందుకే ఆ దేశం నుంచి అక్రమ వలసదారులకు స్వర్గధామం అని అంటారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో విమానం ఇంధనం కోసం పారీస్‌లోని వాట్రీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే.. ఆ దేశ బలగాలు విమానాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయి.
విచారణ పూర్తయ్యే వరకు ఆ దేశంలోనే ప్రయాణికులు
ఈ కేసు దర్యాప్తును యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ విభాగానికి అప్పగించారు. ప్రస్తుతం విచారణ పూర్తయ్యే వరకు ప్రయాణికులను రిసెప్షన్ హాల్‌లోనే ఉంచారు. ప్రస్తుతం 303 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది గుర్తింపులను దర్యాప్తు చేస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ఈ ప్రయాణీకులను ఎక్కడికి, ఏ ప్రయోజనం కోసం తీసుకెళ్తున్నారు. వారిలో కొందరు మైనర్లు కూడా ఉండటంపై దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఒక విదేశీ పౌరుడు దిగితే.. అతనిపై అనుమానం ఉంటే.. ఆపే అధికారం ఆ దేశ సరిహద్దుల బలగాలకు ఉంటుంది. వారిని 4 రోజులు పాటు నిర్బంధించవచ్చు. న్యాయమూర్తి ఆమోదంతో ఆ వ్యక్తిని గరిష్టంగా 26 రోజులు పాటు నిర్బంధించవచ్చని ఆ దేశ చట్టం చెబుతోంది.