Loading...
Earthquake: జపాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. పలు రైళ్లు ఆలస్యం
జపాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. పలు రైళ్లు ఆలస్యం

Earthquake: జపాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. పలు రైళ్లు ఆలస్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌ను ఆదివారం తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం వణికించింది. టోక్యో సహా తూర్పు జపాన్‌లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనలో 30 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. తాజా నివేదికల ప్రకారం 37 మంది వరకు గాయపడినట్లు సమాచారం. జపాన్‌ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం.. దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌లో సుమారు 70 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. టోక్యోతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా కనిపించింది. భూకంపం కారణంగా కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, సర్వీసులు ఆలస్యమయ్యాయి. షింకన్‌సెన్‌ బుల్లెట్‌ రైళ్ల సేవలు మాత్రం సాధారణంగానే కొనసాగాయి. భూకంపం అనంతరం సునామీ ముప్పుపై అధికారులు అప్రమత్తమయ్యారు.

వివరాలు

సునామీ ముప్పు లేదన్న అధికారులు

అయితే తాజా అంచనాల ప్రకారం సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతులపై నష్టం జరిగినట్లు సమాచారం.

నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జపాన్‌ ప్రధాని సనయీ తకాయిచి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, నష్టంపై సమగ్ర వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.

టోక్యోలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ నీటి పైపులు దెబ్బతినడంతో నీరు పైకి ఎగసిపడిన ఘటనలు కూడా నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా, రానున్న రోజుల్లో మరోసారి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని JMA హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ADVERTISEMENT