Trump: ఇరాన్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదు: ఆంక్షల సడలింపుపై ట్రంప్ స్పష్టత
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను సడలించడం, ఆ దేశానికి చెందిన నిలిపివేసిన నిధులను విడుదల చేయడంపై తాను ఎలాంటి ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు వచ్చిన వార్తలను ట్రంప్ ఖండించారు. ''ఇది అవాస్తవం.నేను వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు'' అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంలో స్పష్టమైన పురోగతి సాధిస్తే ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదలపై అమెరికా సిద్ధంగా ఉండొచ్చని అమెరికా అధికారులు గతంలో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ట్రంప్ మాత్రం అలాంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని స్పష్టం చేశారు.
వివరాలు
ఇరాన్ దాడిలో అమెరికా సైనికులకు గాయాలు
అయితే అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష సంప్రదింపులు మాత్రం కొనసాగుతున్నాయి.
ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది.
ఇరాన్ అణు కార్యక్రమంపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని అమెరికా కోరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇరాన్ దాడిలో ఎనిమిది మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
సెప్టెంబరు 14న హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.
ఆ సమయంలో నౌకలో ఉన్న ఎనిమిది మంది సైనికులు గాయపడినట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అమెరికా ప్రభుత్వం తొలుత బహిరంగంగా వెల్లడించలేదు.
తాజాగా సైనికుల గాయాల సమాచారం వెలుగులోకి రావడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
హర్మూజ్‌పై కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు
ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ వివరాలు బయటపడటం గమనార్హం.
హర్మూజ్ జలసంధి సంక్షోభం,ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరాన్ మరోసారి అమెరికాతో పరోక్ష చర్చలు జరిపింది.
ఖతార్,పాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా ఈ సంప్రదింపులు కొనసాగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు.
న్యూయార్క్‌లో జరిగిన సమావేశాలు,సందేశాల మార్పిడికి సంబంధించి అమెరికా నుంచి తుది స్పందన కోసం ఇరాన్ ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు.
హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం,ఇరాన్-అమెరికా చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై ఇరాన్ కొన్ని షరతులను మధ్యవర్తుల ద్వారా అమెరికాకు చేరవేసింది.
వాటిపై వాషింగ్టన్ నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉందని అరాగ్చీ తెలిపారు.
అమెరికా స్పందనను మధ్యవర్తులు తమకు తెలియజేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.