Elon Musk: మస్క్‌కు కోర్టు షాక్.. ఇన్వెస్టర్ల మోసం కేసులో పిటిషన్ తిరస్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్వెస్టర్ల మోసం కేసులో ఎలాన్ మస్క్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్విట్టర్ ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించారనే కేసులో జ్యూరీ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఎలాన్ మస్క్ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా సోమవారం తిరస్కరించింది. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందంపై మనసు మార్చుకున్నారనే కారణంతో పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం సమర్థించలేమని విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2022 మే 13న ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను 'తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు' మస్క్ చేసిన తొలి ట్వీట్ వాస్తవాలకు విరుద్ధమనే అంశానికి బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
వివరాలు
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం తర్వాత వివాదం
2022లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, అనంతరం ఆయన చేసిన పలు ట్వీట్ల ప్రభావంతో కంపెనీ షేర్ల ధరలు భారీగా పడిపోయాయి. దీంతో నష్టపోయిన పెట్టుబడిదారులు కలిసి కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో మస్క్‌పై క్లాస్ యాక్షన్ లాసూట్ దాఖలు చేశారు. ఇక ఇన్వెస్టర్ల కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో, ట్విట్టర్ యాజమాన్యం కూడా ఒప్పందాన్ని అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో మస్క్ చివరకు ముందుగా నిర్ణయించిన ధరకే ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అయితే కంపెనీని స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఇన్వెస్టర్ల మోసం కేసు మాత్రం కొనసాగుతూనే ఉంది.
వివరాలు
బోట్స్ అంశాన్ని సాకుగా వాడుకున్నారన్న ఆరోపణ
ట్విట్టర్‌లో నకిలీ, స్పామ్ (బోట్స్) ఖాతాలు అధికంగా ఉన్నాయంటూ మస్క్ తప్పుడు ప్రచారం చేశారని ఇన్వెస్టర్లు ఆరోపించారు. ఆ వ్యాఖ్యల కారణంగా కంపెనీ షేర్ల విలువ పడిపోవడంతో తాము చాలా తక్కువ ధరలకు తమ షేర్లను విక్రయించాల్సి వచ్చిందని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందం నుంచి బయటపడేందుకు ట్విట్టర్‌లోని బోట్స్ (స్పామ్ ఖాతాలు) అంశాన్ని మస్క్ ఒక సాకుగా ఉపయోగించుకున్నారని జ్యూరీ నిర్ధారించింది. ఈ విషయాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా న్యాయమూర్తి చార్లెస్ బ్రేయర్ కూడా తన వ్యాఖ్యల్లో ప్రస్తావిస్తూ, జ్యూరీ ఇచ్చిన తీర్పును సమర్థించారు.
వివరాలు
రూ.21 వేల కోట్లకు పైగా పరిహారం చెల్లించే అవకాశం
అలాగే, జ్యూరీ సభ్యులు తనను ఎగతాళి చేస్తూ తీర్పు ఫారమ్‌పై '420' అనే సంఖ్యను ప్రత్యేకంగా హైలైట్ చేశారని మస్క్ చేసిన వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ మోసం కేసులో మార్చి 20న వెలువడిన తీర్పు ఆధారంగా ఎలాన్ మస్క్ పెట్టుబడిదారులకు సుమారు 2.6 బిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.21 వేల కోట్లకు పైగా) నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉందని ఇన్వెస్టర్ల తరఫు న్యాయవాది అంచనా వేస్తున్నారు.