Entebbe raid: 4 వేల కి.మీ.దాటి.. 100 మంది బందీలను విడిపించిన ఇజ్రాయెల్ ఆపరేషన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్‌కు హైజాక్ ఘటనలు కొత్త కాదు. 1976లో జరిగిన ఓ విమాన హైజాక్ ఆ దేశ చరిత్రలోనే అత్యంత సంచలన సైనిక ఆపరేషన్‌కు దారితీసింది. నేటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జీవితాన్ని కూడా ఈ ఘటన తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎందుకంటే.. బందీలను విడిపించేందుకు చేపట్టిన ఆ ఆపరేషన్‌లో ఆయన సోదరుడు యొనాతన్ నెతన్యాహు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
హైజాకర్లకు ఉగాండా అధ్యక్షుడి మద్దతు
1976 జూన్ 27. టెల్ అవీవ్ నుంచి పారిస్ బయల్దేరిన ఎయిర్‌ఫ్రాన్స్ 139 విమానం ఏథెన్స్‌లో ఆగింది.
అక్కడి నుంచి తిరిగి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు విమానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆ సమయంలో విమానంలో సుమారు 250 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
హైజాకర్లు విమానాన్ని ఉగాండా రాజధాని కంపాలా సమీపంలోని ఎంటెబె విమానాశ్రయానికి తీసుకెళ్లారు.
ఈ ఘటనలో ఉగాండా ప్రభుత్వం హైజాకర్లకు సహకరించడం గమనార్హం.
అప్పటి ఉగాండా అధ్యక్షుడు ఐడీ అమీన్ స్వయంగా హైజాకర్లకు స్వాగతం పలికినట్లు సమాచారం. అంతేకాదు.. విమానాశ్రయం వద్ద ఉగాండా సైనికులు భద్రత కల్పించారు.
వివరాలు
వారం రోజుల పాటు బందీలుగా..
పాలస్తీనా సహా ఇతర దేశాల్లో నిర్బంధంలో ఉన్న తమ సహచరులను విడిపించుకోవాలనే డిమాండ్‌తో హైజాకర్లు ఈ చర్యకు పాల్పడ్డారు.
తొలుత ఇజ్రాయెల్‌కు చెందని, యూదులు కాని ప్రయాణికులను విడుదల చేశారు.
అయితే 100 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను ఎంటెబె విమానాశ్రయంలోనే బందీలుగా ఉంచారు.
విమాన సిబ్బందిని హైజాకర్లు వెళ్లిపోవాలని ఆదేశించినప్పటికీ.. ప్రయాణికులను వదిలి వెళ్లేందుకు కెప్టెన్, సిబ్బంది నిరాకరించారు.
దీంతో వారు కూడా బందీలుగానే ఉండిపోయారు. ఈ సంక్షోభాన్ని దౌత్యపరంగా పరిష్కరించేందుకు ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బందీలను రక్షించేందుకు సైనిక చర్య చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాలు
నిర్మాణ సంస్థ నుంచి కీలక సమాచారం
బందీలు ఎక్కడ ఉన్నారో, వారిని ఎలా చేరుకోవాలో ఇజ్రాయెల్ సైన్యానికి తొలుత స్పష్టమైన సమాచారం లేదు.
పైగా ఉగాండా ప్రభుత్వం నుంచి సహకారం లభించే పరిస్థితి కూడా లేదు.
దీంతో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ రంగంలోకి దిగింది. బందీలను ఉంచిన టెర్మినల్ భవనాన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ నిర్మించిందని గుర్తించారు.
ఆ సంస్థతో సంప్రదింపులు జరిపి టెర్మినల్ నిర్మాణం, గదుల అమరిక, ఇతర వివరాలను సేకరించారు.
ఈ సమాచారంతో బందీలను రక్షించేందుకు సైనికులు పక్కా ప్రణాళిక రూపొందించారు.
నాలుగు మిలిటరీ కార్గో విమానాలు ఉగాండా వైపు బయల్దేరాయి.
వాటితో పాటు రెండు ఫైటర్ జెట్లు కూడా వెళ్లాయి. శత్రు రాడార్లకు చిక్కకుండా విమానాలు అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించాయి.
వివరాలు
మెర్సిడెస్, లాండ్‌రోవర్‌లతో మభ్యపెట్టే వ్యూహం
జులై 3 రాత్రి 11 గంటల సమయంలో ఓ కార్గో విమానం ఎంటెబె విమానాశ్రయంలో దిగింది.
దాని నుంచి మెర్సిడెస్, లాండ్‌రోవర్ కార్లు బయటకు వచ్చాయి.
సాధారణంగా ఇలాంటి వాహనాలను ఉగాండా అధ్యక్షుడు ఐడీ అమీన్ ఉపయోగించేవారు.
అమీన్ కాన్వాయ్ వస్తోందనే భావన కలిగించేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఈ వ్యూహాన్ని అనుసరించింది.
వాహనాలు భద్రతా తనిఖీ కేంద్రాలను దాటి టెర్మినల్ భవనం వైపు వెళ్లాయి.
అయితే అక్కడి కొందరు ఉగాండా సైనికులు వాహనాలు తమ దేశానికి చెందినవి కావని గుర్తించారు.
వారిని అడ్డుకునే ప్రయత్నం జరగడంతో ఇజ్రాయెల్ కమాండోలు నిశ్శబ్ద పిస్తోళ్లతో కాల్పులు జరిపి వారిని హతమార్చారు.
వివరాలు
ఆపరేషన్‌కు యొనాతన్ నెతన్యాహు నాయకత్వం
బందీలను రక్షించేందుకు చేపట్టిన ఈ సైనిక చర్యకు ఇజ్రాయెల్ సాయుధ దళాల అధికారి యొనాతన్ నెతన్యాహు నాయకత్వం వహించారు.
ఆయన ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోదరుడు.
ఇజ్రాయెల్ కమాండోలు టెర్మినల్ సమీపానికి చేరుకున్న తర్వాత హైజాకర్లను లొంగిపోవాలని హెచ్చరించారు.
విమానాశ్రయం తమ ఆధీనంలో ఉందని ప్రకటించారు. అయితే ఉగాండా సైనికులు ప్రతిఘటించడంతో పరిస్థితి ఒక్కసారిగా కాల్పులకు దారితీసింది.
కమాండోలు టెర్మినల్‌లోకి ప్రవేశించి హైజాకర్లపై దాడి చేశారు.
ఈ సమయంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు బందీలు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన బందీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి రన్‌వే వైపు తరలించారు.
వివరాలు
అక్కడే యొనాతన్ నెతన్యాహు మృతి
బందీలను విమానంలోకి ఎక్కిస్తున్న సమయంలో ఉగాండా సైనికులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో యొనాతన్ నెతన్యాహు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు ఇజ్రాయెల్ కమాండోలు గాయపడ్డారు.
తర్వాత జరిగిన దర్యాప్తులో యొనాతన్‌పై కాల్పులు జరిపిన ఉగాండా సైనికుడు అప్పటి అధ్యక్షుడు ఐడీ అమీన్‌కు బంధువని, ఆ ఘర్షణలో అతడు కూడా మరణించినట్లు వెల్లడైంది.
సుమారు 53 నిమిషాల పాటు సాగిన ఈ సైనిక ఆపరేషన్ చివరకు విజయవంతమైంది.
వివరాలు
అక్కడే యొనాతన్ నెతన్యాహు మృతి
బందీలను రక్షించిన ఇజ్రాయెల్ కమాండోలు వారిని వెంట తీసుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ సాహసోపేత చర్యకు తొలుత 'ఆపరేషన్ థండర్‌బోల్ట్' అని పేరు పెట్టారు.
అనంతరం యొనాతన్ నెతన్యాహు చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ దానికి 'ఆపరేషన్ యొనాతన్'గా పేరు మార్చారు.
ఈ ఘటన నెతన్యాహు కుటుంబంపై, ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు జీవితంపై చెరగని ముద్ర వేసింది.